
1850కి పైగా కేసుల నమోదు
విజయనగరం టౌన్: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రత్యేక కార్యాచరణ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో పూరి రథయాత్రకి వెళ్లి, వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులు శనివారం విశాఖపట్టణం నుంచి విజయనగరం మీదుగా రైళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వెయిటింగ్ హాల్స్, క్యాటరింగ్ స్టాల్స్, ప్యాంట్రీకార్ల వద్ద ఆహార పదార్ధాలను పరిశీలించారు. టికెట్ లేకుండా ప్రయాణాలు చేసే వారిపై దృష్టి సారించారు. 1850 మందికి పైగా టికెట్ లేకుండా ప్రయాణాలు చేస్తున్న వారిని గుర్తించి, వారి నుంచి రూ.11 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేసినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ పేర్కొన్నారు. టికెట్ల కోసం సరైన క్యూలను నిర్వహించాలని, రైళ్లలో బోర్డింగ్ సులభతరం చేయాలని, క్యూఆర్ ఆధారిత కోడ్‌లతో డిజిటల్ చెల్లింపులను ఉపయోగించాలని, మండే వస్తువులను తీసుకువెళ్లవద్దని, టికెట్ తనిఖీ చేసినప్పుడు సరైన ఐడీ రుజువును చూపించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.