
వాచ్‌మన్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్‌సెంటర్‌లో గల రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కనిమెరకల వెంకట రమణ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాఘవులు నిందితుడి అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు. హతుడు వెంకటరమణ కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పాత బొబ్బిలిలోని చికెన్‌షాపులో పనిచేస్తున్న కోట సర్వేశ్వర రావు ఈ కేసులో నిందితుడని స్పష్టం చేశారు. వాచ్‌మన్ కనిమెరకల వెంకటరమణ విధుల్లో ఉండగా ఈనెల 20న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో బొబ్బిలి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. భర్తతో గొడవలున్న తన కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సర్వేశ్వర రావును వెంకటరమణ గట్టిగా హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న సర్వేశ్వరరావు గ్రోత్ సెంటర్‌కు వెళ్లి వెంకటరమణపై దాడి చేశాడు. సీసీ టీవీ పుటేజీ, కాల్‌డేటా, సంఘటన స్థలం వద్ద దొరికిన పర్స్ ఆధారంగా విచారణ జరిపి నిందితుడ్ని ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన సీఐ కె.సతీష్‌కుమార్, ఎస్సై రమేష్, సిబ్బందిని డీఎస్పీ రాఘవులు అభినందించారు.