
ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ఆటగాళ్లు..!
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల జాతీయ చెస్ చాంపియన్ షిప్ పోటీలు రెండవ రోజు ఆసక్తికరంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్‌లో నిర్వహిస్తున్న రెండోరోజు పోటీలను చిన్న శ్రీను సోల్జర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె పోటీల్లో విజేతలుగా నిలవాలంటూ ప్రోత్సహించారు. ఇదిలా ఉండగా దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన106 మంది క్రీడాకారులు జాతీయ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో తలపడుతుండగా..రెండవ రోజు ముగిసే సమయానికి 8 రౌండ్‌లు పూర్తయినట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జాల్వాముఖి తెలిపారు. శనివారం 9వ రౌండ్ ముగిసిన అనంతరం విజేతలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. వివిద కేటగిరీల్లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్న క్రీడాకారులను త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.
ఆసక్తికరంగా చెస్ పోటీలు