కరెంటు కోత!
బిల్లుల
వాత..
సాక్షి, పార్వతీపురం మన్యం :
ఎండలు మండుతున్నాయి. అంతకుమించి ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓవైపు అడపాదడపా వానజల్లులు కురుస్తున్నా.. వాతావరణం మాత్రం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఈ సమయంలో అనధికార విద్యుత్ కోతలు ప్రజలను విసిగిస్తున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా కోతలు ఉండటంతో ఇళ్లలో ఉండలేకపోతున్న పరిస్థితి. ఇదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మాత్రం గతంతో పోల్చుకుంటే రెండింతలు, మూడింతలు పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. సమయపాలన లేకుండా నిర్వహణ, ఇతర కారణాలు చెబుతూ కోత విధిస్తున్నారు. కొన్నిచోట్ల రోజులో నాలుగైదు గంటల చొప్పున సరఫరా ఉండటం లేదని విద్యుత్ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో అన్నీ కలిపి 2.84 లక్షలకుపైగా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం వేసవి ప్రభావం ఉండటంతో రోజుకు 1.190 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వినియోగమవుతోంది. వినియోగం పెరగడం ఒకవైపు.. కొద్దిరోజులుగా అడపాదడపా గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. చిన్నపాటి గాలి వీచినా కరెంటు నిలుపు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ప్రధానంగా నిర్వహణ, మరమ్మతుల పేరిట రోజులో మూడు, నాలుగు గంటలకుపైగా సరఫరా నిలిచిపోతోంది.
● పార్వతీపురం మండలంలోని నర్సిపురం 11కేవీ ద్వారా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా అవ్వగా.. ఆర్కే బట్టివలస, రంగాలగూడ, అడ్డూరువలస, సంగంవలస, ఎమ్మార్‌నగరం, సమీప ప్రాంతాలకు తరచూ విద్యుత్ కోతల కారణంగా గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారో తెలియక వాడుక నీరుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటం.. దోమల బెడదతో జ్వరాల బారిన పడుతున్నారు.
● పార్వతీపురం పట్టణంలో నిర్వహణ, మరమ్మతుల పేరిట వారంలో రెండు రోజులు 3 నుంచి 4 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నారు.
● బలిజిపేట మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయి. ఒక వైపు ఎండల తీవ్రత, ఉక్కబోత విసిగిస్తుండగా.. అప్రకటిత విద్యుత్ కోతలు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కోతలు ఉన్నాయి. వర్షాల ప్రభావం వల్ల ఈదురు గాలులు వీచినా, వర్షం పడుతుందనే అనుమానం కలిగినా సరఫరాకు బ్రేక్ ఇస్తున్నారు. సీతానగరం మండలంలో మరమ్మతుల పేరుతో తరచూ సరఫరా నిలిచిపోతోంది.
● సాలూరు మండలంలో అనధికార కోతలు కొనసాగుతున్నాయి. రోజులో దాదాపు 2 నుంచి 3 గంటల వరకు కోత విధిస్తున్నారు. దీంతో వ్యవసాయ పంపుసెట్లు కూడా ఆగిపోయి రైతులకు ఇబ్బంది కలుగుతోంది.
● కొమరాడ మండలంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలున్నాయి. అర్ధరాత్రి సమయంలోనూ సరఫరా నిలిచిపోవడంతో ఫ్యాన్లు తిరగక, ఉక్కబోత భరించలేక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. జియ్యమ్మవలస మండలంలో ప్రతి శుక్రవారం నిర్వహణ పనుల పేరిట ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా ఆగిపోతోంది. గరుగుబిల్లి మండలంలో ఏ మాత్రం వర్షం కురిసినా, గాలి వీచినా కొన్ని గంటల పాటు సరఫరా నిలిచిపోతోంది.
● పాలకొండ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల పేరుతో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా ఆగిపోతోంది. దీనికి తోడు గాలులు, వర్షం కారణంగా సాయంత్రం సుమారు 2 గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా ఆధారిత వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పిండిమిల్లులు, వైద్య పరీక్ష కేంద్రాలు నడుపుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● వ్యవసాయం చేసుకొనే రైతులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందించేది. నేడు పగటి పూట కనీసం 6 గంటల సేపు కూడా సరఫరా చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
● వీరఘట్టం మండలంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చే త్రీఫేస్ కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. విద్యుత్ కోసం రైతులు పంపుసెట్ల వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. భామిని మండలంలోనూ ఇదే స్థితి. సీతంపేట ఏజెన్సీలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. చిన్నపాటి వర్షాలకు సైతం రోజంతా సరఫరా ఆగిపోతోంది. లేకుంటే రోజులో ఏదో సమయాన రెండు, మూడు గంటలపాటు నిలుపు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది సాలూరు మండలం కురుకుట్టి పంచాయతీ పెదబారిగాం గ్రామంలోని కొండతామర చిన్నప్ప ఇంటికి జూన్ నెలలో వచ్చిన కరెంటు బిల్లు. అక్షరాలా రూ.7,624లు. వినియోగం వంద యూనిట్లే. గిరిజనుడైన ఈయనకు ఎస్సీ, ఎస్టీ రాయితీ కూడా ఉంటుంది. తనకు వచ్చిన బిల్లు చూసి లబోదిబోమంటున్నాడు.
u
జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు
రోజుకు మూడు, నాలుగు గంటలపాటు నిలుపుదల
మరోవైపు వినియోగదారులకు చార్జీల మోత
చార్జీల బాదుడు
విద్యుత్ లేకున్నా.. బిల్లుల బాదుడు మాత్రం వినియోగదారులకు తప్పడం లేదు. గతంలో రూ.200లోపు వచ్చిన వారికి ఇప్పుడు రూ.400 నుంచి రూ.600 వరకు బిల్లు వస్తోంది. గిరిజన ఆవాసాలకు సైతం రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల రాయితీ కూడా వర్తింపజేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ట్రూ ఆప్ చార్జీలు, సర్ చార్జీలంటూ ఎప్పుడో వినియోగానికి ఇప్పుడు లెక్క కట్టి వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
కరెంటు కోత!


