
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
సీతంపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. పీఓ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 135 అర్జీలను కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిష్కారమయ్యే సమస్యలపై అర్జీదారు సంతృప్తి చెందాలని స్పష్టం చేశారు. ఫిర్యాదు దారులు తమ అర్జీలను మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అర్జీదారులకు చెప్పారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన కొన్ని వినతులు..
● కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, నడవలేని స్థితిలో ఉన్నానని ఆర్థికసాయం అందజేయాలని మెట్టూరుకు చెందిన బంటు వెంకటరావు వినతిపత్రం అందజేశాడు.
● టీటీడీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో 105 గుడులు మంజూరయ్యాయని ఇప్పుడు అర్ధాంతరంగా నిర్మాణాలు నిలిచిపోయాయని వాటిని పూర్తి చేయాలని ఎంపీపీ ఆదినారాయణ తదితరులు కోరారు. మండల ప్రజాపరిషత్‌కు నూతన భవనం మంజూరు చేయాలని విన్నవించారు.
● పెండింగ్‌లో ఉన్న రహదారి పనులు సకాలంలో పూర్తి చేయాలని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు విన్నవించారు.
● సీతంపేటలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ షాపులు పంచాయతీకి అప్పగించాలని సర్పంచ్ ఆరిక కళావతి వినతిపత్రం ఇచ్చారు. పెద్దూరులో మంచినీటి ట్యాంకు ఏర్పాటు చేయాలని సర్పంచ్ ఆదిలక్ష్మి కోరారు.
● రాయిమానుగూడ గ్రామస్తులు నవీన్, బాలకృష్ణ తదితరులు మంచినీటి ట్యాంకు గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరారు. బూర్జమానుగూడకు చెందిన చంద్రరావు పిడుగుపాటుకు గురై మృతిచెందడంతో పరిహారం ఇప్పించాలని కుటుంబసభ్యులు వినతి ఇచ్చారు.
కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, జిల్లా పరిశ్రమల అధికారి కరుణాకర్, డ్వామా పీడీ రామచంద్రరావు, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్ పాల్, ఉద్యాన వన అధికారి శ్యామల, ట్రైబల్ వెల్ఫేర్ డీడీలు కృష్ణవేణి, అన్నదొర, డీఎంహెచ్‌వో భాస్కరరావు, ఉపవైద్యాధికారి విజయపార్వతి, డీపీఓ కొండలరావు, ట్రాన్స్‌కో పర్యవేక్షక ఇంజినీర్ చలపతిరావు, తహసీల్దార్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పీజీఆర్‌ఎస్‌కు 135 అర్జీలు