
హత్య కేసును ఛేదించిన పోలీసులు
శృంగవరపుకోట: మండలంలో సంచలనం రేకెత్తించిన తల్లి హత్యకేసును ఎస్.కోట పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను సోమవారం ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ రాత్రి తన తల్లి, చెల్లి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి తన తల్లి ఎర్రాప్రగడ వెంకటలక్ష్మి(35)ని తీసుకుపోయారని చెల్లెలు రుచిత చెప్పిందని వెంకటరమణపేట గ్రామానికి చెందిన ఎర్రాప్రగడ హరీష్ 18వ తేదీ ఉదయం 5గంటలకు ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనుమానాలే ఆధారంగా..
హరీష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా ఘటనాస్థలిలో రక్తపుమరకలు ఉండడంతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేపట్టామన్నారు. రుచిత వాదనల్లో సరైన పొంతన లేకపోవడంతో అనుమానంతో గట్టిగా విచారణ చేయడంతో వాస్తవాలు చెప్పింది. తన తల్లిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన స్నేహితులతో కలిసి పథకం ప్రకారం హత్య చేశామని చెప్పింది. శవాన్ని దగ్గరలోని నేలబావిలో రాళ్లు కట్టి పడేసి, కొబ్బరి మట్టలు వేసి కప్పారన్నారు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు డీఎస్పీ చెప్పారు.
ప్రేమ వికటించింది
గ్రామానికి చెందిన సలాది హరికృష్ణ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ డ్రైవర్ రుచితతో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించాడు. ఇది నచ్చని రుచిత తల్లి వెంకటలక్ష్మి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయనని చెప్పింది. అప్పటికీ హరికృష్ణ తన తీరు మార్చుకోక పోవడంతో వెంకటలక్ష్మి ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో హరికృష్ణపై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం కేసు ట్రయల్స్‌కు రావడంతో తనపై కేసు తీసేయాలని, రుచితను తనకిచ్చి పెళ్లి చేయాలని, వెంకటలక్ష్మిని హరికృష్ణ ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో రుచితతో కలిసి హత్యకు పథకం పన్నాడు. బహిర్భూమికి అంటూ రుచితతో చెప్పించి వెంకటలక్ష్మిని బయటకు రప్పించి హరికృష్ణ, రుచితలు మరో బాలుడితో కలిసి, గొంతు కోసి హత్య చేశారు. రుచితను జువైనల్ హోమ్‌కు తరలించి హత్య చేసి పరారైన హరికృష్ణ కోసం మూడు బృందాలను రంగంలోకి దించారు. సోమవారం అందిన సమాచారంతో ఒడిశా వైపు బైక్‌పై వెళ్తున్న హరికృష్ణను, హత్యానేరంలో ఉన్న మరో బాలుడిని అరెస్టు చేసి, వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని, వాంగ్మూలం రికార్డు చేసి, కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ వి.నారాయణమూర్తి, ఎస్సైలు చంద్రశేఖర్, గంగరాజు పాల్గొన్నారు.