
కౌలు రైతుల కంటకన్నీరు..!
● అన్నదాత సుఖీభవ లేనట్లేనా అని ఆందోళన
● వైఎస్సార్‌సీపీ హయాంలో
రైతుభరోసా అందజేత
కౌలు రైతులకు వర్తించదు
అన్నదాత సుఖీభవ పథకం కోసం భూ యాజమానులు, అటవీ భూమి సాగు చేస్తున్న రైతుల వివరాలు వెరిఫికేషన్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. వారికే వెరిఫికేషన్ చేస్తున్నాం. కౌలు రైతులకు ఈ విడతలో అన్నదాత సుఖీభవ వర్తించదు. కౌలు రైతుల గుర్తింపు, రెన్యువల్ జరుగుతుంది.
– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే రైతులందరికీ రైతు భరోసా సాయాన్ని పెంచుతాం. అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పింది. తీరా అధికారంలో వచ్చిన మొదటి ఏడాదే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగ్గొట్టింది. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ ఇస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. ఇందుకోసం రైతుల వివరాలను వెరిఫికేషన్ చేస్తున్నారు. అయితే కౌలు రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ పథకం వర్తించే సూచనలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కౌలు రైతుల గుర్తింపు పక్రియ పూర్తిస్థాయిలో ఇంతవరకు జరగలేదు. దీని వల్ల వారికి అన్నదాత సుఖీభవ సాయం అందడం అనుమానంగా కనిపిస్తోంది.
ఈ ఏడాది కౌలు రైతుల గుర్తింపు
లక్ష్యం 16250
2025–26 ఖరీఫ్ సీజన్‌లో వేలాది మంది కౌలు రైతులను గుర్తించాల్సి ఉంది. కానీ వ్యవసాయ అధికారులు చాలా తక్కువ మందిని గుర్తించారు. ఈ ఏడాది 16,250 మంది కౌలు రైతులను గుర్తించాల్సి ఉండగా ఇంతవరకు గుర్తించింది కేవలం 200 మందిని మాత్రమే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏప్రిల్, మే నెలలోనే కౌలు రైతుల గుర్తింపుపై అవగాహన సదస్సులు నిర్వహించి కౌలు రైతులకు సాగు ఽహక్కు పత్రాలు ఇచ్చేవారు. కానీ ఈఏడాది మే నెల రెండో వారం వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కానట్లు తెలుస్తోంది.
భూయాజమానులు, అటవీభూములు
సాగు చేసే వారికే..
అన్నదాత సుఖీభవ పథకం కింద అందించే ఆర్థిక సాయానికి భూయాజమానులు, అటవీ భూములు సాగు చేసే వారే అర్హులని ప్రభుత్వం పేర్కొంది. దీన్ని బట్టి కౌలు రైతులకు ఆర్థిక సాయం ఇచ్చే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. జిల్లాలో భూయాజమానులకు, అటవీభూమి సాగు చేసే రైతులకు వ్యవసాయ అధికారులు అన్నదాత సుఖీభవ పథకం కోసం వెరిఫికేషన్ చేస్తున్నారు. జిల్లాలో 4,89,252 మంది రైతులు ఉన్నారు. వారిలో 2,159 మంది అటవీ భూమి సాగుచేసే వారు ఉన్నారు. మొత్తం రైతుల్లో 4,36,744 మంది రైతులకు వెరిఫికేషన్ చేశారు. ఇంకా 50 వేల మందికి పైగా వెరిఫికేషన్ పూర్తి కావాల్సి ఉంది. ఈనెల 25వతేదీతో వెరిఫికేషన్‌కు గడువు పూర్తవుతుంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
రైతు భరోసా సాయం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భూయాజమానులు, అటవీభూమి సాగు చేసే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం కింద సాయం అందజేశారు. దీంతో వారు మిగతా రైతుల మాదిరి వారు సాగు చేసిన పంటలకు పెట్టుబడి పెట్టుకునే వారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే వారు.