
గృహనిర్మాణాల్లో ప్రగతి లేకుంటే చర్యలు
పార్వతీపురం టౌన్: జిల్లాలో పేదల కోసం నిర్మితమవుతున్న గృహ నిర్మాణాల్లో వచ్చేవారానికి ప్రగతి లేకుంటే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గృహనిర్మాణశాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమాశంలో ఆయన మాట్లాడారు. ప్రతివారం వందల సంఖ్యలో గృహాలు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఈ వారం 70 గృహాలు మాత్రమే పూర్తికావడంపై మండిపడ్డారు. గృహ నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక, స్టీల్ అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ గృహ నిర్మాణాలు వెనుకంజలో ఉండడం సరికాదని, వచ్చే వారానికి ప్రగతి కనిపించకపోతే సంబంధిత డీఈఈలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పీఎం జన్‌మన్ గృహ నిర్మాణాలు మరింత వేగవంతం చేసి వచ్చే వారానికి 90 శాతం ప్రగతి కనిపించాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని, అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. యోగాంధ్రను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సేవలు పట్ల సంతప్తి స్థాయి ఏ మేరకు ఉందన్న విషయమై వివిధ రకాల సర్వేలను చేపడుతుందని, అందులో జిల్లా ముందంజలో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో కె.హేమలత, జిల్లా ఉద్యానవన అధికారి బి.శ్యామల, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ పీడీలు ఎం.సుధారాణి, డాక్టర్ టి.కనకదుర్గ, డీపీఓ టి.కొండలరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు, ప్రొగ్రాం అధికారి జగన్మోహన్‌రావు, మునిసిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.