
జీఓ నంబర్ 3ను రద్దుచేయాలి
● షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులనే నియమించాలి ● ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్ష
పార్వతీపురం: గిరిజన నిరుద్యోగ యువతకు హాని కలిగించే జీఓ నంబర్ 3ను రద్దుచేసి దాని స్థానంలో కొత్త జీఓను విడుదల చేసి అమలు చేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గిరిజన యువత రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ మేరకు గురువారం ఏపీ ఆదివాసీ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుతో పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రిలే నిరాహారదీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఏజేఏసీ నాయకులు టి.జయన్న, ఎం.అమర్నాఽథ్, వై.సూర్యనారాయణ, డి.సీతారాంలు మాట్లాడుతూ 2025 మెగా డీఎస్సీలో ప్రకటించిన ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసులనే నియమించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ నిరక్ష్యరాస్యత దృష్ట్యా షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన ఉపాధ్యాయులనే నియమించాలనే చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కోరారు. ఏపీ గిరిజన సలహా మండలిలో ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలను నియమించడంతో పాటు మిగిలిన ఎస్టీ ఎమ్మెల్యేలను కూడా కమిటీలో నియమించి జీఓ నంబర్ 3ను రద్దుచేసి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన యువతను ఉపాధ్యాయులుగా నియమించేలా కొత్త జీఓను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గిరిజన యువతకు న్యాయం చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేయనున్నామని హెచ్చరించారు. ఈ దీక్షలో ఐ.రామకృష్ణ, ఎ.చంద్రశేఖర్, కె. గౌరమ్మ, పి. రంజిత్‌కుమార్, యు.మల్లయ్య, సురేష్, నాగభూషణంతో పాటు నిరుద్యోగ యువత పాల్గొన్నారు.