
రీసర్వేలో పక్కాగా సరిహద్దులు నిర్ణయించాలి
● రీసర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వేతో భూ సమస్యలు తొలగి రైతులకు, భూ యజమానులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. రెండవ విడత రీ సర్వే కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మండలంలోని తాళ్లబురిడి గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భూ సర్వే జరిపే ముందు రైతులకు నోటీసులు జారీ చేసి, గ్రామంలో రైతుల భూములతో పాటు గ్రామ సరిహద్దులు, నీటి వనరుల భూములు, పోరంబోకు భూములకు కొలతలు వేసి కచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా రైతులకు, భూ యజమానులకు శాశ్వత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల సమక్షంలోనే భూమి కొలతలు వేసి తమ భూమికి సంబంధించిన హద్దులు నిర్ణయిస్తారని తెలిపారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి రీ సర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. తప్పులు దొర్లకుండా పక్కగా నిర్వహించాలన్నారు. రైతులకు నోటీసులు జారీ చేస్తున్నది లేనిది అడిగి ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత మేర సర్వే నిర్వహించిన విషయమై తహసీల్దార్ వై.జయలక్ష్మిని ప్రశ్నించగా 1147 ఎకరాల గ్రౌండ్ ట్రూటింగ్ పూర్తి కాగా మిగతా 31 ఎకరాలు సర్వే నిర్వహించాల్సి ఉందని ఆమె తెలిపారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తహసీల్దార్‌తో మాట్లాడుతూ మరణించిన భూ యజమానుల వారసులకు మార్పు చేసే విధంగా ఎఫ్‌ఎంసీ విచారణ పూర్తి చేసి మ్యుటేషన్‌లను పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలు తలెత్తకూడదనేది ప్రధానమైన రీ సర్వే ఉద్దేశమని, రైతులు పక్కా భూ రిజిస్ట్రేషన్లు చేసుకొనేలా ప్రోత్సహించాలని సూచించారు. రోడ్లుకు కేటాయించిన భూములలో హద్దులు నిర్ణయించి రక్షణ కల్పించాలన్నారు. చెరువులు, వాగులలోని ఆక్రమణలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వే, భూ రికార్డుల నిర్వహణ శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి.రవి తేజ, మండల సర్వేయర్ స్వామి, గ్రామ సర్వేయర్ నాయుడు, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.