
నీరుపేద రైతుల ఆందోళన
● సాగునీటి కష్టాలు తీర్చండంటూ వేడుకోలు ● ఇబ్బందులు పడుతున్న ఐదుగ్రామాల రైతులు ● సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ ఆవరణలో నిరసన
పార్వతీపురంటౌన్: కొమరాడ మండలం కోటిపాం గ్రామ ప్రజలు వనకాబడి గెడ్డ ఆయకట్టు ద్వారా వచ్చే సాగు నీటి ద్వారా వ్యవసాయపనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గెడ్డపై కొత్త చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో తమకు సాగునీరు అందడం లేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కోటిపాం గ్రామలో 500 కుటుంబాలున్నాయని వనకాబడి గెడ్డ ఆయకట్టు నుంచి వచ్చిన నీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. వనకాబడి గెడ్డ నుంచి వనకాబడి, బట్టిమాగవలస, చినఖేర్జల, లింగందొర వలస, బూర్జి వలస మీదుగా వచ్చి కోటిపాం కొత్తచెరువులో గెడ్డ నీరు కలుస్తుందని, చెరువు నిండిన తర్వాత ఈ చెరువు నుంచి సుమారు పది చెరువులు, బందలు నిండుతాయని, ఈ నీటి వనరుల మీదే తాము సాగుచేసుకుంటూ బతుకుతున్నామని తెలిపారు.
వెయ్యి ఎకరాలకు ఈ సాగు నీరే ఆధారం
వెయ్యి ఎకరాల సాగు ఈనీటి మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామన్నారు. వనకాబడి ఆయకట్టు నీరు ప్రధానంగా కోటిపాం గ్రామానికి వస్తుంది. కావున గత 28న వనకాబడి గెడ్డపై చెక్‌డ్యామ్ నిర్మించేందుకు పరిశీలించారని, దీనికి సంబంధించిన చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణం అలాగే ఉంటే తమ గ్రామానికి రావాల్సిన ఆయకట్టు నీటికి ఇబ్బంది ఉండదన్నారు. కానీ కొత్తగా చెడ్‌డ్యామ్ నిర్మించడం వల్ల మా గ్రామానికి రావాల్సిన నీరు ఆగిపోతుంది. దీంతో చాలామంది రైతులు ఇబ్బందికి గురవుతారని తెలియజేస్తున్నారు. తమ గ్రామ రైతులకు వ్యవసాయానికి ఈ చెక్‌డ్యాం ద్వారా వచ్చే నీరు మాత్రమే ఆధారమని, పరిశీలించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చేసి తమకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.
కొత్త చెడ్‌డ్యామ్ నిర్మాణం వద్దు
గ్రామంలో 500మంది కుటుంబాలకు సంబంధించిన సుమారు 1000 ఎకరాలకు వనకాబడి గెడ్డ ఆయకట్టు ద్వారా వచ్చే సాగు నీటి ద్వారా పంటలు పండుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చెక్‌డ్యాం ప్రాంతంలో కొత్తగా మరో చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు. దీనివల్ల రైతులకు తీవ్రనష్టం చేకూరుతుంది. అధికారులు ఈ విషయంపై పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
– ఎజ్జు గుంపస్వామి, రైతు, కోటిపాం
రైతులను ఆదుకోండి
ఎన్నోఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న రైతులను ఆధికారులు ఆదుకోవాలి. వనకాబడి ఆయకట్టు గెడ్డపై నిర్మించనున్న చెక్‌డ్యాం పనులను ప్రారంభించరాదు. సుమారు వెయ్యి ఎకరాలకు పైబడి సాగునీరు అందిస్తున్న గెడ్డపై ప్రస్తుతం ఉన్న చెక్‌డ్యాంను యథావిదిగా ఉంచి రైతులకు సాగునీటిని అందజేయాలి.
– పాండ్రంకి రామకృష్ణ, రైతు, కోటిపాం
500 కుటుంబాల జీవనాధారం పోతుంది
నూతన చెక్‌డ్యాం నిర్మాణం వల్ల గ్రామంలో గల 500మంది కుటుంబాలకు జీవనాధారం పోతుంది. ఐదు గ్రామాలకు సాగునీటి కష్టాలు ఏర్పడతాయి. ప్రభుత్వం, అధికారులు పునరాలోచించి చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న చెక్‌డ్యాం ద్వారానే నీటిని సరఫరా చేయాలి. – పప్పల సోమేశ్వరరావు, రైతు, కోటిపాం

నీరుపేద రైతుల ఆందోళన

నీరుపేద రైతుల ఆందోళన

నీరుపేద రైతుల ఆందోళన