పార్వతీపురం: మన్యం జిల్లాలో ఉన్న జంఝావతి, అడారు గెడ్డ, పెద్దగెడ్డ, తోటపల్లి, వెంగళరాయ, ఒట్టిగెడ్డ, జంపరకోట, కారిగెడ్డ, గుమ్మిడిగెడ్డ తదితర సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించని నేపథ్యంలో కార్యాచరణ రూపొందించనున్నట్టు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందు కోసం శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవో హోంలో నీటి పారుదల ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. రైతులంతా హాజరు కావాలని ఆయన కోరారు.
తివ్వా కొండల్లో ఏనుగులు
భామిని: మండల సరిహద్దులోని తివ్వా కొండల్లోకి ఏనుగులు శుక్రవారం వెళ్లాయి. మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు నాలుగు ఏనుగులు తాటిమానుగూడ – ఇప్పమానుగూడ మీదుగా కొండల పైకి చేరుకున్నాయి. వర్షాకాలంలో బురద ప్రాంతాల్లో ఏనుగులు ఉండలేవని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. కురుపాం – గుమ్మలక్ష్మీపురం మండలాల సరిహద్దులోని చీడిగూడ నుంచి తిత్తిరి వైపు వెళ్లిన ఏనుగులు తాజాగా తివ్వా కొండల్లోకి చేరుకున్నాయి. దీంతో పల్లం ప్రాంత రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఖైదీల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
పాలకొండ రూరల్: రిమాండ్ ఖైధీల ఆరోగ్య రక్షణపై జైలు సిబ్బంది దృష్టి పెట్టాలని జిల్లా జైళ్ల శాఖ అధికారి మోహనరావు అన్నారు. పాలకొండ సబ్ జైలును ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ క్రమంలో అక్కడి పరిసరాలు, వసతులు, రికార్డుల నిర్వహణపై సూపరింటెండెంట్ బి.జోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వేసవి నేపఽథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం నిరుపయోగంగా ఉన్న పాత సామగ్రిని వేలం వేయించారు.
పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్ శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్‌విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
అందరి సమన్వయంతోనే అభివృద్ధి
● మున్సిపల్ ఆర్‌డీ రవీంద్ర
విజయనగరం గంటస్తంభం: అన్ని శాఖల సమన్వయంతో నగరపాలక సంస్థ మరింత అభివృద్ధి చెందే దిశగా కృషి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ వి.రవీంద్ర అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందితో వేర్వేరుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. విభాగాల వారీగా ప్రగతి నివేదికలను పరిశీలించి, వాటి ఆధారంగా పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.

నేడు పార్వతీపురంలో రైతుల సమావేశం