
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
సీతానగరం: మండలంలోని బల్లకృష్ణాపురం గ్రామంలో సోమవారం ఉదయం బొత్స రమణమ్మ (75) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీనిపై పార్వతీపురం సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం రమణమ్మ గ్రామంలోని తన నివాసంలో గెడ్డలుప్పి గ్రామానికి చెందిన తన కుమార్తు సొంగల లక్ష్మితో కలిసి ఉంటోంది. ఆదివారం రాత్రి ఎలుకలు, చిన్న ఇల్లు అని వేరొకరి ఇంట్లో నిద్రించడానికి మృతురాలి కుమార్తె వెళ్లింది. ఆ రాత్రి ఇంట్లో ఒంటరిగా రమణమ్మ నిద్రించింది. సోమవారం తెల్లవారుజామున లక్ష్మి ఇంటికి వచ్చి తల్లి రమణమ్మను లేపేందుకు చూడగా విగతజీవిగా పడి ఉండడం గమనించి భోరున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గ్రహించారు. రమణమ్మకు మెడనొప్పి నివారణ కోసం మెడకు బెల్టు కట్టుకుని నిద్రించే అలవాటు ఉంది. తన తల్లిది సాధారణ మరణం అని కుమార్తె లక్ష్మి తొలుత భావించింది. అయితే మృతురాలిపై చీర వేయడం నిమిత్తం ఇంట్లో ఉన్న బీరువా దగ్గరికి వెళ్లి తెరవగానే అందులో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, డబ్బులు కనిపించక పోవడంతో ఆందోళన చెందింది. తమ ఇంట్లో దొంగలు పడి బంగారం ఆభరణాలు డబ్బులు చోరీ చేసి తల్లిని హత్య చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంఘటనాస్థలానికి సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ ఎస్సై నీలకంఠం, సిబ్బంది చేరుకుని క్లూస్‌టీమ్, గాగ్‌స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. రమణమ్మ మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి ఇద్దరు కుమారులు విశాఖపట్నం, హైదరాబాద్‌లో ఉంటారు.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి