పట్టుమని 20 నిమిషాలు వస్తే ఒట్టు... | - | Sakshi
Sakshi News home page

పట్టుమని 20 నిమిషాలు వస్తే ఒట్టు...

Mar 23 2025 9:12 AM | Updated on Mar 23 2025 9:07 AM

తాగునీరా.. మురుగునీరా?

సాలూరు రూరల్‌: సాలూరు పట్టణంలో రెండు దశాబ్దాల క్రితం వేసిన పైప్‌లైన్‌లు కావడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ఫలితంగా కుళాయిల ద్వారా వస్తున్న తాగునీటిలో బురద, నలకలు ఉంటున్నాయి. పట్టణ వాసులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

సాలూరులో సరఫరా అవుతున్న కలుషిత నీరు

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో వేసవి ఆరంభంలోనే దాహం కేకలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందజేస్తామంటూ ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్న మాటలు ఆచరణ దూరంగా ఉంటున్నాయి. తాగునీరు అందక ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పార్వతీపురం పురపాలక సంఘంలో నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్న పరిస్థితి నెలకొంది. సాలూరు పురపాలక సంఘంలో నీటిలో కాలువ వ్యర్థాలు వస్తుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలు సైతం గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి.. ఇంటింటికీ కుళాయిలు వేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ట్యాంకుల్లో నీటి సరఫరా చేయక, నిరుపయోగంగా వదిలేశాయి. జిల్లాలో నీటి సమస్యను అరికట్టేందుకు వాటర్‌ గ్రిడ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. 15 మండలాలకు నీటిని అందించడానికి తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్‌ జలాశయాలను గుర్తించారు. భామిని, సీతంపేట మండలాలకు హిరమండలం బ్యారేజీ నుంచి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.2వేల కోట్లకుపైగా వ్యయమవుతోందని అంచనా వేస్తున్నారు. ఇది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

ప్రకటనలకే పరిమితం

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుందే తప్ప.. ఆచరణలో సాధ్యం కావడం లేదు. క్రాస్‌ ప్రొగ్రాం అంటూ అన్ని మండల కేంద్రాల్లో యంత్రాంగం చేసిన హడావిడి కొద్దిరోజులకే పరిమితమైంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటికి ఇంత ఇబ్బంది ఉంటే రానున్న రెండు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని గిరిజన, పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో జల్‌జీవన్‌ మిషన్‌ పథకం పనులు ప్రారంభిస్తే.. అందులో చాలా వరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలుపు చేసింది. జిల్లాలో మొత్తం 3,302 వరకు పనులు మంజూరు కాగా.. దాదాపు రూ.526 కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో వివిధ కారణాలను చూపి 2,013 పనులను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేయడం గమనార్హం. ఫలితంగా ఈ వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు.

పాలకొండలో దాహం కేకలు

పాలకొండ: పాలకొండ నగర పంచాయతీలో సుమారు 38 వేల మంది జనాభా ఉంటే.. తాగునీటి సరఫరా రోజుకు 6 లక్షల లీటర్ల దాటి జరగడం లేదు. వాస్తవానికి రోజుకు 20 లక్షల లీటర్ల వరకు తాగునీటిని జనాభా ప్రాతిపదికన అందించాల్సి ఉంది. వేసవి వస్తే పట్టణంలోని కొత్తగా ఏర్పడిన కాలనీలకు నీటి సరఫరా జరగడం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కో ప్రాంతానికి నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవిలో పైపులైన్‌ మరమ్మతులు జరిగితే రెండుమూడు రోజులపాటు పూర్తిగా బంద్‌ కావాల్సిందే. 50 ఏళ్ల నాటి పైపులైన్లు కావడంతో కాలువల్లో ఉన్న పైపులు శిథిలమై కుళాయిల ద్వారా మురుగు, బురదనీరు వస్తోంది. గారమ్మకాలనీ, బుట్టిమటం కాలనీలకు కనీసం పైపులైన్లు వేయని దుస్థితి నెలకొంది. నాన్‌అమృత్‌ పథకం ద్వారా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.57లక్షలు మంజూరు చేసి పైపులైన్‌ సిద్ధం చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పైపులైన్లను గాలికి వదిలేసింది.

గుమ్మలక్ష్మీపురం: కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండల కేంద్రంలో గల ఎస్సీ, ఎస్టీ వీధులకు సక్రమంగా తాగునీటి సరఫరా జరగక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రెండురోజులకోసారి కుళాయిల ద్వారా తాగునీరు కేవలం 20 నిమిషాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. రోజూ తాగునీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో రెండురోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. వేసవి దృష్ట్యా ప్రతిరోజూ కనీసం ట్యాంకుల ద్వారా అయినా సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పట్టుమని 20 నిమిషాలు వస్తే ఒట్టు... 1
1/2

పట్టుమని 20 నిమిషాలు వస్తే ఒట్టు...

పట్టుమని 20 నిమిషాలు వస్తే ఒట్టు... 2
2/2

పట్టుమని 20 నిమిషాలు వస్తే ఒట్టు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement