పార్వతీపురం టౌన్: పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్(డీఎంసీఎస్)గా ఐ.రాజేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఇప్పటివరకు జిల్లా మేనేజర్‌గా కొనసాగిన పి. శ్రీనివాసరావు స్థానంలో ఈమె పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు.
దర్బార్‌లో ఇఫ్తార్ విందు
విజయనగరం టౌన్: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని బాబామెట్టలోని సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి ఖాదర్‌బాబా సూఫీ క్షేత్రంలో ఆలయ ధర్మకర్త ఖలీల్‌బాబు సారథ్యంలో గురువారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. విశాఖ నుంచి హాజరైన రవిచంద్ర రవి, ఖలీల్‌బాబు తనయుడు అహ్మద్‌బాబుతో కలిసి ఉపవాస దీక్షాపరులకు ఆత్మీయతతో వడ్డన చేశారు. అనంతరం పరిసర ప్రాంత ప్రజలు, భక్తులకు ఖాదర్‌బాబా వారి అన్న సమారాధనను నిర్వహించారు.
నూనె గింజల పంటల
సాగు పెంచాలి
విజయనగరం ఫోర్ట్: నూనె గింజల పంటలైన నువ్వు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణం పెంచాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయం సేద్య విభాగ అధిపతి డాక్టర్ ఎం.భరతలక్ష్మి అన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ అధికారులకు, విస్తరణ అధికారులకు, వీఏఏలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూనె గింజల పంటల్లో కలుపు నివారణకు మార్కెట్‌లో కలుపు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వేరుశనగ పంటలో కదిరి లేపాక్షి, నిత్య వారిత వంటి రకాలను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ యు.త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
రెన్యువల్స్ సకాలంలో
చేయించుకోవాలి
విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్స్ సకాలంలో రెన్యూవల్స్ చేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల వైద్యులకు కెపాసిటి బిల్డింగ్, జనరల్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ వెల్లడించకూడదన్నారు.
డీఎంసీఎస్‌గా రాజేశ్వరి బాధ్యతల స్వీకరణ
డీఎంసీఎస్‌గా రాజేశ్వరి బాధ్యతల స్వీకరణ