ఈ చిత్రంలోని వ్యక్తి పేరు బొడబల్ల అప్పలనాయుడు. సాలూరు మండలం పెదపదం పంచాయతీలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకునిగా 2006 నుంచి పని చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇతనిని తొలగించేందుకు కుట్రలు మొదలయ్యాయి. రాజకీయ కక్షతో గతేడాది చివర్లో తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. దీంతో అతను అధికారులను ఆశ్రయించాడు. గత ఏడాది నవంబరులో పీజీఆర్‌ఎస్‌కు వచ్చి కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. ఓ వైపు అతని నుంచి వివరణ కోరుతూనే.. మరోవైపు ఈ ఏడాది జనవరి 22న టెర్మినేషన్ చేస్తూ ఉత్తర్వులు పంపించారు. దీంతో ఆయన న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కాడు. ఎటువంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా అతనిని తొలగించడం భావ్యం కాదని కోర్టు తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో అతను అధికారులను కలుస్తున్నప్పటికీ.. న్యాయం జరగలేదు. మరోసారి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చాడు. తమకు న్యాయస్థానం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాలేదంటూ అధికారులు యథావిధిగా తప్పించుకుంటున్నారని అతను వాపోయాడు. తన స్థానంలో రాజకీయ ఒత్తిళ్లతో వేరేవారిని తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.