
ఆపదలో ఆరోగ్యమిత్రలు..!
● ఆరోగ్య శ్రీస్థానంలో బీమా కంపెనీ
తీసుకొస్తున్న సర్కారు
● ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయోనని ఆందోళన
●ఈనెల 17, 24 తేదీల్లో విధులు
బహిష్కరించనున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది
విజయనగరం ఫోర్ట్: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్య సేవ) పథకంలో పనిచేసే ఆరోగ్య మిత్రల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియక సతమతమవు తున్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా కంపెనీని కూటమి సర్కారు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీమా కంపెనీని తేవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బీమా కంపెనీ వస్తే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు, టీమ్‌లీడర్లు, ఆఫీస్ సిబ్బందిని కొనసాగిస్తారా? లేదా? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈనెల 10వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసే ఆరోగ్య మిత్రలు, టీమ్‌లీడర్లు, ఆఫీస్ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు ఈనెల 12న వారిని చర్చలకు పిలిచారు. చర్చలు విఫలం కావడంతో ఆరోగ్యశ్రీ సిబ్బంది ఈనెల17, 24 తేదీల్లో విధులు బహిష్కరించనున్నారు.
గత ప్రభుత్వం హయాంలో సంతోషంగా విధులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఆరోగ్య మిత్రలు ఎటువంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా సంతోషంగా పనిచేశారు. ఉన్నతాధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ మిత్రలపై ఎటువంటి ఒత్తిడి తెచ్చేవారు కాదు. దీంతో వారు కూడా తాము చేయాల్సిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించేవారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు పనిచేస్తారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వ్యాధులకు చికిత్స కోసం వచ్చే వారికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత వైద్యుడి దగ్గరకు పంపిస్తారు. ఆస్పత్రిలో చికిత్సకోసం కానీ, శస్త్రచికిత్స కోసం చేరినట్లయితే వారికి సకాలంలో చికిత్స, శస్త్రచికిత్స జరిగేలా చూడడం ఆరోగ్య మిత్ర విధి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ రోగులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా? అని పర్యవేక్షించడం, ఎవరైనా ఆస్పత్రి సిబ్బంది సేవలు అందించడం కోసం చేతివాటం ప్రదర్శించినట్లయితే వారి ఫిర్యాదును కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లడం వారి విధి.
జిల్లాలో నెట్‌వర్క్ ఆస్పత్రులు 30
జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు 30 ఉన్నాయి. గజపతినగరం, రాజాం, ఎస్.కోట ఏరియా ఆస్పత్రులు, బాడంగి, భోగాపురం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల సీహెచ్‌సీలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి విజయనగరం, విజయనగరం ఘోషాఆస్పత్రి, అభినవ ఆస్పత్రి ఎస్.కోట, ఎస్.కోట కొలపర్తి ఆస్పత్రి, విజయనగరం సాయి పీవీఆర్ ఆస్పత్రి, సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వెంకటరామా ఆస్పత్రి, ఆంధ్ర హాస్పిటల్, మారుతి ఆస్పత్రి, పీజీ స్టార్ ఆస్పత్రి, స్వామి కంటి ఆస్పత్రి, నెఫ్రాఫ్లస్ ఆస్పత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రి, మువ్వ గోపాల ఆస్పత్రి, గాయత్రి ఆస్పత్రి, పుష్పగిరి ఐ ఆస్పత్రి, తిరుమల నర్సింగ్ హోమ్, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, జీఎంఆర్ కేర్ ఆస్పత్రి, అమృత ఆస్పత్రి, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, వెంకట పద్మ ఆస్పత్రులు నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు షిఫ్టుల ప్రకారం పనిచేస్తున్నారు.
చర్చలు విఫలం
మా సమస్యలపై ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులతో జరిగిన చర్చలు విపలమయ్యాయి. దీంతో ఈనెల 17, 24 తేదీల్లో విధులు బహిష్కరించనున్నాం. బీమా కంపెనీ పరిధిలోకి వెళ్తే మా ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో అన్న స్పష్టత లేదు. దీంతో ఏం జరుగుతుందోననే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.
జెర్రి పోతుల ప్రదీప్,
ఆరోగ్య మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు
విధుల్లో 96 మంది మిత్రలు
ఆరోగ్యశ్రీ పథకంలో జిల్లాలో 96 మంది ఆరోగ్య మిత్రలు పనిచేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కో ఆర్డినేటర్ ఒకరు, జిల్లా మేనేజర్ ఒకరు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఆఫీస్ అసోసియేట్ ,నలుగురు టీమ్ లీడర్లు పనిచేస్తున్నారు.

ఆపదలో ఆరోగ్యమిత్రలు..!