గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండల కేంద్రంలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు గురువారం పర్యటించారు. ముందుగా కురుపాం ఎంపీపీ స్కూల్ ఆవరణలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనం ద్వారా అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ తీరును పరిశీలించారు. సరుకుల కొలతలను తనిఖీ చేశారు. అక్కడే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి కోడి గుడ్ల నిల్వలు, రికార్డుల నిర్వహణ, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. జీసీసీ ఆధ్వర్యంలోని ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్‌ను సందర్శించి కందిపప్పు, బియ్యం, పంచదార, పామాయిల్ తదితర సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణపై ఆరా తీశారు. కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించి మధ్యాహ్న భోజన వంటకాలను రుచి చూశారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాసరావు, జీసీసీ డీఎం వి.మహేంద్రకుమార్, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, వైద్యారోగ్య శాఖ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు, ఆహార భద్రత అధికారి వై.రామయ్య, తూనికలు, కొలతల అధికారి కె.రత్నరాజు, తదితరులు ఉన్నారు.