రెంటికీ చెడ్డ రేవడిలా..!

పెదరావుపల్లి గ్రామం ముఖచిత్రం - Sakshi

కొత్తవలస: శతాబ్దం క్రితం జరిగిన పొరపాటు ఆగ్రామ రైతుల పాలిట శాపంగా మారడంతో నేటికీ అవస్థలు పడుతున్నారు. వంద సంవత్సరాలుగా వరి, జీడి, మామిడి, కొబ్బరి పంటలు సాగుచేసుకుంటున్న భూములను కొండ పోరంబోకుగా రికార్డుల్లో నమోదు చేయడంతో క్రయ దస్త్రావేజులుండీ హక్కులు లేక ఆవేదన చెందుతున్నారు. ఆనాటి పొరపాటును సరి చేయాలని దశాబ్దాలుగా ప్రభుత్వాధికారులు, పాలకుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. అసలు ఆగ్రామం ఏ జిల్లా, ఏ మండలం పరిధిలోకి వస్తుందో తెలియక క్షేత్రస్థాయిలో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. కొత్తవలస మండలంలోని కాటకాపల్లి పంచాయతీ పెదరావుపల్లి గ్రామ పరిస్థితి ఇది. పెదరావుపల్లి గ్రామం విశాఖ, విజయగనరం జిల్లాల మధ్య ఉంది.ఈ గ్రామం పరిధిలో 868.75 ఎకరాల భూమి ఉంది. స్వాతంత్య్రం రాక ముందు 1902వ సంవత్సరంలో జరిగిన భూ సర్వేలో ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని కొంత భాగాన్ని శృంగవరపుకోట తాలుకా నుంచి భీమునిపట్నం తాలుకాకు మార్చాలనే ఉద్దేశంతో అప్పటి అధికారులు సర్వే ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు తమ గ్రామాన్ని శృంగవరపుకోట తాలూకాలోనే ఉంచాలని పట్టుబట్టి అప్పటి సర్వేకు సహకరించలేదు. దీంతో అప్పట్లో సర్వే అధికారులు 674.75 ఎకరాల భూమిని శృంగవరపుకోట తాలూకాలో చూపించి, మిగిలిన పెదరావుపల్లి గ్రామాన్ని, ఆ గ్రామ రైతులు సాగు చేస్తున్న 194 ఎకరాల సాగు భూమిని భీమునిపట్నం తాలూకాలోని పద్మనాభం మండలంలో సర్వే నంబర్‌–1లో కొండపోరంబోకుగా నమోదు చేసేశారు.

పొరపాటును అధికారులు గుర్తించినా..

గ్రామంలో అప్పట్లో జరిగిన సర్వే తప్పిదాన్ని మళ్లీ 1965లో జరిగిన రీ సర్వేలో అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి సమస్య పరిష్కరించాలని గ్రామ రైతులు అధికారులు, పాలకుల చుట్టూ తిరిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

వైఎస్సార్‌ జగనన్న భూ సర్వేతో కదలిక

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న భూ సర్వేతో ఆ గ్రామ సమస్యలో కదలిక మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చొరవతో ఆ గ్రామ ఎంపీటీసీ కిలపర్తి అప్పలపరిదేశినాయుడు, పెంట అప్పారావు, పెంట జగ్గునాయుడు, బాదిరెడ్డి అప్పారావు తదితరుల ఆధ్వర్యంలో గ్రామ రైతులు ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో సమస్యను లేవనెత్తి జిల్లా మాజీ కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆమె కొత్తవలస తహసీల్దార్‌ కార్యాలయానికి, జిల్లా సర్వే డిపార్ట్‌మెంట్‌కు లేఖలు రాసి సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలను అందించాలని కోరారు. ఈ మేరకు నిర్వహించిన సర్వేలో పెదరావుపల్లి గ్రామంలో రైతులు సాగుచేస్తున్న భూములు మొత్తంగా 194 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ భూమి విశాఖ జిల్లా, పద్మనాభం మండలం, కొవ్వాడ గ్రామం సర్వే నంబర్‌–1లో కోండపోరంబోకు భూములుగా నమోదైనట్లు ధ్రువీకరించారు. ఈ భూములను విజయనగరం జిల్లా కొత్తవలస మండలం పెదరావుపల్లి గ్రామంలోకి చేర్చాలని ప్రధాన భూ పరిపాలన కమిషనర్‌కు గత కలెక్టర్‌ ఎం.సూర్యకుమారి రేఖా నంబర్‌ 876/2022–ఎ1తో గత సెప్టెంబర్‌–11న పంపించారు.ఈ నివేదికల ఆధారంగా సత్వరం న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వాస్తవంగా పెదరావుపల్లి గ్రామానికి సంక్షేమ,అభివృద్ధి పనులకు నిధులు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నుంచే అదుతున్నాయి.విశాఖ జిల్లా పద్మనాభం మండలానికి పెదరావుపల్లి గ్రామానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ గ్రామం పరిధిలో సంభవించే క్రిమినల్‌, సివిల్‌ కేసులు ఎక్కడ నమోదు చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తమకు దశాబ్దాల పాటు రుణాలు గాని, ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాలు కూడా అందడం లేదని వాపోతున్నారు.




 

Read also in:
Back to Top