ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
నరసరావుపేట టౌన్: ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ తెలిపారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. పట్టణ శివారు గుంటూరు రోడ్డు స్వర్గపురి సమీపంలో తనిఖీలు చేస్తుండగా గుంటూరు రామిరెడ్డినగర్‌కు చెందిన షేక్ ఇస్మాయిల్ పోలీసులను చూసి ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనుమానంతో అతన్ని వెంబడించి పట్టుకొని విచారించారు. విచారణలో వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించాడన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో చోరీకి గురైన ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనాలను యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు.
ఎనిమిది వాహనాలు స్వాధీనం


