ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేద్దాం
చిలకలూరిపేట: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపు నిచ్చారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమం చేపట్టిన విషయం విదితమేనన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో సేకరించిన 63,511 సంతకాల ప్రతులను జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు పంపడం జరిగిందన్నారు. అలా పంపిన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రతులను సోమవారం నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరుగుతుందన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు వారి పిల్లలకు వైద్య విద్యను అందించేందుకు జగనన్న ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య ప్రతి ఒక్కరిదిగా భావించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతనిధులు భారీగా తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల అధ్యక్షులు షేక్ దరియావలి, దేవినేని శంకరరావు, వడ్డేపల్లి నరసింహరావు, మంగు ఏడుకొండలు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, నాయకులు కొప్పురావూరి పటేల్, రాచమంటి చింతారావు, అప్పాపురం షేక్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
మాజీ మంత్రి విడదల రజిని


