సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యం
నగరంపాలెం: సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యమేనని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్‌డీ.విల్సన్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలో ఆదివారం 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ నిర్వహించారు. రమ్య భారతి సాహిత్య పత్రిక నుంచి చలపాక ప్రకాష్, శ్రీ వసిష్ట సోమేపల్లి నిర్వహణలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. రమ్య భారతి గౌరవ సలహాదారులు వేముల హాజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, అకాడమీ చైర్మన్ ఆర్‌డీ.విల్సన్ మాట్లాడుతూ సాహిత్యంలో మానవతా విలువలు ఉన్నప్పుడు రాణిస్తుందని పేర్కొన్నారు. ఏపీ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి.భవానిదేవి, ప్రముఖ కథకులు శ్రీ కంఠస్ఫూర్తి మాట్లాడుతూ మనిషిలో అంతర్లీనంగా ఉన్న సాహిత్యాన్ని వెలికితీసేందుకు వేదికను నెలకొల్పిన మహా వ్యక్తి సోమేపల్లి అని కొనియాడారు. అదే బాటలో ఆయన కుమారుడు శ్రీ వశిష్ట సోమే పల్లి పయనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కథల పోటీల్లో ప్రథమ విజేత సింగరాజు శ్రీనివాసరావు (గెలుపు), ద్వితీయ విజేత జి.రంగబాబు (ఇకనైనా మారండి ), తృతీయ విజేత బీఎస్కే.కరీముల్లా (బేరం), ప్రోత్సాహక ఉత్తమ పుర స్కారాలను సింహప్రసాద్, ఎం.వెంకటేశ్వరరావు (హైదరాబాద్), ఇంద్రగంటి నరసింహమూర్తి (కాకినాడ) కు అందించి, సత్కరించారు. సభలో సాహితీవేత్త లు కేంద్ర సాహిత్య అవార్డుగ్రహీతలు పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, రావెల సాంబశివరావు, సీహెచ్.సుశీలమ్మ, శివప్రసాద్, తోట కూర వెంకటనారాయణ, సుభాని పాల్గొన్నారు.


