ఏపీఆర్‌జేసీలో ఘనంగా స్వర్ణోత్సవాలు
విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాల నాగార్జునసాగర్ పరివార్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైమ్యాట్ డైరెక్టర్, ఏపీఆర్‌ఈఐ కార్యదర్శి వి.ఎన్.మస్తానయ్య ముఖ్యఅతిథిగా విచ్చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురు సత్కారం జరిగింది. 1975వ సంవత్సరం నుంచి ప్రస్తుతం అధ్యాపకులుగా ఉన్న వారివరకు 118మంది అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎన్.సరోజిని మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఆర్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎస్ వంటి ఉన్నత ఉద్యోగులుగా.. వివిధ రంగాలలో ఉన్నతులుగా చేసిన కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పని చేయడం గర్వకారణమన్నారు. గురువుల గౌరవం మసకబారుతున్న నేటి దినాల్లో తమ గురువుల పట్ల గౌరవాన్ని సజీవంగా ఉంచి, గురుభక్తిని చాటుకుని కళాశాల పూర్వ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఏపీఆర్‌జేసీ పూర్వవిద్యార్థులు ఎ.సైదారెడ్డి, ఎస్.నాగచారి, డా. కె.వీరనంది, డా.చక్రపాణి, జి.గోపాలరావులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐజీ రమేష్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి డా.కె.వెంకటేశం, ఐఎఫ్‌ఎస్ అంబాసిడర్ సీహెచ్ రాజశేఖర్, పూర్వ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.


