ఘనంగా ముగిసిన విజ్ఞాన్ బాలోత్సవ్
●జోనల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు
● హజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు,
ఎమ్మెల్యే చదలవాడ
నరసరావుపేట రూరల్: విద్యార్థులు బాల్యం నుంచే విభిన్నంగా ఆలోచించే దృక్పధాన్ని అలవరచుకోవాలని ఎంపీ, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని డీఎస్‌ఏ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన విజ్ఞాన్ బాల మహోత్సవ్ జోనల్ ఆటల పోటీలు శనివారం ముగిశాయి. ఎంపీ లావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రియేటివిటి, ఇన్నోవేషన్, విభిన్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇండోర్ గేమ్, అవుట్ డోర్ గేమ్, వ్యక్తిగత హాబీ వంటి మూడు వ్యాపకాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మూడు వ్యాపకాలను పాటిస్తే విద్యార్థులు కోరుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారని వివరించారు. జీవితంలో ఎప్పుడూ సెల్ప్ రెస్పెక్ట్, ఇంటిగ్రిటి విషయంలో రాజీపడకూడదని, తల్లిదండ్రులు గర్వపడేలా మన పనులు ఉండాలని హితవు పలికారు. దేశం మీలాంటి యువతపై ఆశలు పెట్టుకుందని, మీ జీవిత కథలో మీరే హీరోలుగా మారాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో ఎలా మెలగాలి, ఎలా పనిచేయాలో తెలుస్తుందన్నారు. బాల మహోత్సవ్‌లో భాగంగా బాల, బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, 100 మీట్లు, 800 మీటర్లు, రిలే, లాంగ్‌జంప్, షాట్‌పుట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.


