రాష్ట్రస్థాయి ఫెన్సింగ్, కలైపట్టు పోటీలు ప్రారంభం
పెదకాకాని: విద్యార్థులంతా క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యాయా మోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చుక్కా కొండయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి కలైపట్టు, ఫెన్సింగ్ పోటీలు గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆధునిక నర్సింగ్ హోం డాక్టర్ వీర్నల ప్రత్యూష్ మాట్లాడుతూ క్రీడల ద్వారా దేహదారుఢ్యం, స్నేహ సంబంధాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు. కలైపట్టు అండర్– 17 బాలబాలికల విభాగాల్లో 60 మంది పాల్గొన్నారన్నారు. పెన్సింగ్ అండర్– 17, అండర్– 19 బాలబాలికల విభాగాల్లో పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. 360 మంది క్రీడాకారులు హాజరు పోటీలకు రాష్ట్రస్థాయిలో 13 జిల్లాల నుంచి సుమారు 360 మంది క్రీడాకారులు హాజరయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీలు ఎం. గోపి, కె. నాగశిరీష ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ శిల్ప సిందూర, పర్యవేక్షకులు మోహనలక్ష్మి, వ్యాయామోపాధ్యాయుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. లక్ష్మీపతి, పలువురు పీఈటీలు పాల్గొన్నారు.


