జిల్లాలో గ్యాస్ డెలివరీ పారదర్శకంగా ఉండాలి
ఎల్‌పీజీ, ఎఫ్‌పీ డీలర్లతో పౌరసరఫరాల అధికారి
కీలక సమావేశాలు
నరసరావుపేట: జిల్లాలో గ్యాస్ డెలివరీ పారదర్శకంగా ఉండాలని పల్నాడు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐవీఆర్‌ఎస్ కాల్ సర్వే ద్వారా పౌరుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎల్‌పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్యాస్ డెలివరీ వ్యవస్థ, డెలివరీ బాయ్స్ ప్రవర్తన, దీపం–2 అమలుపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సానుకూల అభిప్రాయాలను డీలర్లకు వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సానుకూల దృక్పథం కోసం డెలివరీ బాయ్స్‌కు కఠిన ఆదేశాలు జారీ చేయాలని డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించారు. వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందించడం, మర్యాదపూర్వకంగా ప్రవర్తించటం, రసీదు కంటే అధికంగా డబ్బులు వసూలు చేయకుండా ఉండటం, బుకింగ్ నుంచి డెలివరీ వరకు పారదర్శకత పాటించడం తప్పనిసరిగా నిర్వహించాలి స్పష్టం చేశారు. జిల్లాలోని దాచేపల్లి, రొంపిచర్ల రేషన్‌షాపు డీలర్లతో సమావేశాలు నిర్వహించి సానుకూల దృక్పథం లేని డీలర్లను గుర్తించి, వారి పని తీరును తక్షణం సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. ప్రతినెలా నాణ్యమైన రేషన్ సరుకులు విధిగా ఇవ్వాలని, లేనిపక్షంలో తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


