చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షిస్తాం
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
దాచేపల్లి: చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. మండలంలోని గామాలపాడు గ్రామంలో పల్నాటి తొలి మహిళ మంత్రి నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. దేవాలయంలో వద్ద గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంత రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి సంబంధించిన భూ సమస్యలపై ఆరా తీశారు. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న భూములను తిరిగి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎంతో ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం అభివృద్ధికి తమ వంతు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. కలెక్టర్ వెంట గురజాల ఆర్టీవో మురళీకృష్ణ, సర్పంచి జంగా సురేష్, తహసీల్దార్ జీ.శ్రీనివాస్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు ఉన్నారు.
ఏపీఐఐసీ భూములను పరిశీలన
మాచర్ల రూరల్: వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని రాయవరం గ్రామంలో ఏపీఐఐసీ భూములను పరిశీలించి మాట్లాడారు. 200 ఎకరాల ఏపీఐఐసీ భూములకు అప్రోచ్ రోడ్డు, విద్యుత్ సరఫరా తదితర విషయాల పై అధికారులతో మాట్లాడారు. సర్వే రికార్డులను ఆమె పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. గురజాల ఆర్‌డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ బి. కిరణ్‌కుమార్ ఉన్నారు.


