కబడ్డీ ఓవరాల్ చాంపియన్ పల్నాడు జిల్లా
పెదకూరపాడు: గ్రామీణ స్థాయి నుంచి కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పని చేస్తుందని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ యలమంచిలి శ్రీకాంత్ అన్నారు. మూడు రోజులుగా పెదకూరపాడులోని జీఆర్‌సీఆర్‌కే శ్రీ చైతన్య పాఠశాలలో రాష్ట్రస్థాయి కబడ్డీ బాలురు, బాలికల పోటీలు, రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు, రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయి కబడ్డీ బాలురు విభాగంలో పల్నాడు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా ద్వితీయ స్థానంలో, మూడో స్థానంలో కాకినాడ, శ్రీకాకుళం జిల్లాలు జాయింట్ విన్నర్లుగా నిలిచాయి. బాలురు విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారుడు మణికంఠ బెస్ట్ రైడర్ అవార్డు పొందారు. బెస్ట్ ఆల్ రౌండర్‌గా పల్నాడు జిల్లాకు చెందిన జి హరీష్ నిలిచారు. కబడ్డీ బాలికల విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. జాయింట్ విన్నర్‌గా కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లాలు నిలిచాయి. బాలిక విభాగంలో బెస్ట్ రైడర్‌గా విశాఖకు చెందిన కుమారి, బెస్ట్ ఆల్ రౌండర్‌గా హరీష్ నిలిచారు. షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన విజయ్, గోపి ప్రథమ స్థానంలో, గుంటూరుకు చెందిన జితేంద్ర, నవీన్ల జోడి ద్వితీయ స్థానంలో నిలిచారు. విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజినీర్ కళాశాలకు చెందిన ప్రవీణ్, కృష్ణల జోడి తృతీయ స్థానంలో నిలిచింది. వాలీబాల్ విభాగంలో పల్నాడు జిల్లాకు చెందిన జీఆర్‌సీఆర్‌కే పాఠశాల, గుంటూరు జిల్లాకు చెందిన మేడికొండూరు జట్లు ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతితోపాటు షీల్డ్ అందించారు. జీఆర్‌సీఆర్‌కే శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్లు గుత్తా రాము, కవిత పాల్గొన్నారు.


