సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోండి
నరసరావుపేట రూరల్: విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు శుక్రవారం బహుమతులు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. లైంగిక వేధింపుల నుంచి మహిళలను, చిన్నారులను రక్షించడంలో విద్యార్థుల పాత్ర, నేటి పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల విభాగంలో సీహెచ్ నవ్యశ్రీ (సత్తెనపల్లి), ఏ.ప్రవల్లిక (నరసరావుపేట), జే.వైష్ణవి (సత్తెనపల్లి)లు, పోలీసు సిబ్బంది విభాగంలో బి.ఆనంద్, బి.సరోజ్‌కుమార్, ఎం.అనిల్‌లు విజేతలుగా నిలిచారు. వీరికి జిల్లా ఎస్పీ కృష్ణారావు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ, వెల్ఫేర్ ఆర్‌ఐ ఎల్.గోపినాథ్ పాల్గొన్నారు.
విద్యార్థులకు జిల్లా ఎస్పీ
బి.కృష్ణారావు సూచన


