పురుగుమందుల అక్రమ రవాణాపై కేసు
వినుకొండ: ఆర్టీసీ కార్గో కేంద్రంగా పురుగుమందులు అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు వినుకొండ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేశారు. వినుకొండ ఏపీఎస్‌ఆర్టీసీ పార్సిల్ కార్యాలయంలో ఆదివారం వినుకొండ ఏడీఏ సీహెచ్.రవికుమార్ తనిఖీలు నిర్వహించి ఎలాంటి బిల్లులు లేని బీఏఎస్‌ఎఫ్ పురుగుమందులను, ఎఫ్‌ఎంసీ మార్షల్ 36 లీటర్లు సీజ్ చేసి రూ.3లక్షలకు పైగా విలువ గల పురుగుమందులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వినుకొండ కేంద్రంగా జీరో వ్యాపారం
కొంతకాలంగా వినుకొండ ప్రాంతంలో నకిలీ బయో ఎరువులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా జీరో వ్యాపారం చేస్తూ రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తాజాగా పండు, చరణ్ అనే ఇద్దరు వ్యక్తుల పేరుతో కార్గో ద్వారా వినుకొండకు పురుగుమందులు సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. ఈపూరు మండలానికి చెందిన ఎమ్మెల్యే సమీప బంధువు వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్గోలో పెద్దఎత్తున పురుగుమందులు సరఫరా జరిగాయని, సరుకు మొత్తం పంపిణీ అయిన తరువాత కేవలం రూ.మూడు లక్షల పురుగుమందులను పట్టుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వ్యవసాయాధికారులు కేసును పూర్తిస్థాయిలో విచారించాలని పోలీసులకు అప్పగించడం కొసమెరుపు.


