సీసీఐ రాజ్యం..దళారుల భోజ్యం
సీసీఐ రాజ్యం..దళారుల భోజ్యం సత్తెనపల్లి: జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాల్లో దళారులు తిష్ట వేశారు. అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని దందా చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1,20,400 మంది రైతులు 2.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున 12.28 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. మోంథా తుఫాన్‌తో దిగుబడులు తగ్గటంతో పాటు పత్తి తడిచి రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఈ క్రమంలో మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు 11 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తేమ ఎక్కువగా ఉందని, రంగు మారిందనే సాకులతో తిరస్కరించిన పత్తి వెనుక పెద్ద మతలబు ఉన్నట్లు అర్థమవుతుంది. నిబంధనల పేరుతో కొంత పత్తిని తిరస్కరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టీడీపీ మద్దతుదారులైన దళారులు తిరస్కరించిన పత్తిని కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
అక్రమాలు ఇలా...
పత్తిని మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు సీఎం యాప్‌లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, కపాస్‌కిసాన్ యాప్‌లో పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. స్లాట్ బుక్‌కాక రైతులు అల్లాడుతున్నారు. ఏదో విధంగా తిప్పలుపడి స్లాట్ బుక్ చేసుకుని వేల రూపాయల బాడుగతో తీసుకెళ్తే సీసీఐ అధికారులు ఒకటి, రెండు నిమిషాల్లోనే తేమ ఎక్కువగా ఉంది, రంగు మారిందనే సాకులతో తిరస్కరిస్తున్నారు. ఒక రోజు 100 మంది రైతులకు స్లాట్ బుక్ అయితే ఇందులో 20 శాతం రైతుల పత్తిని తిరస్కరిస్తున్నారని తెలుస్తుంది. తిరస్కరించిన పత్తిని వెనక్కి తీసుకెళ్లడానికి మళ్లీ వేల రూపాయల బాడుగ చెల్లించాలి. ఈ భారం భరించలేక అక్కడే ఉన్న దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు.
ఇదీ తిర ‘కాసు’ ...
రైతుల నుంచి తక్కువ ధరకు కొనే సమయంలో దళారులు రైతులతో ఒక అనధికార ఒప్పందం చేసుకుంటున్నారు. ‘మేం లోపల వాళ్లతో మాట్లాడతాం, మీ పేరుతో స్లాట్‌బుక్ చేస్తాం. మీ బ్యాంకు ఖాతాకే డబ్బులు పడతాయి. మనం ఒప్పందం చేసుకున్న ప్రకారం మీ ధర ప్రకారం నగదు ఉంచుకొని మిగిలిన మొత్తం మాకు ఇవ్వాలి.’ అని ఒప్పందం చేసుకుంటున్నారు. సీసీఐ అధికారులు తిరస్కరించిన పత్తిని వెనక్కి తీసుకెళ్లలేక దళారులకు విక్రయిస్తున్నారు. సీసీఐ అధికారులు తిరస్కరించిన పత్తిని దళారులు తీసుకొస్తే కొనుగోలు చేస్తున్నారు. రైతులు తీసుకెళ్లినప్పుడు కనిపించిన తేమ, రంగు దళారులు ద్వారా వెళ్ళినప్పుడు మాత్రం కనిపించడం లేదు. ఈ అక్రమాల్లో మార్కెట్ కమిటీ అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దళారులకు అధిక ధర
ఈ నెల 5 నాటికి 2,146 మంది రైతులకు చెందిన 88,091 క్వింటాళ్లు పత్తిని రూ.68.45 కోట్లకు కొనుగోలు చేశారు. రైతులకు వారాల తరబడి దొరకని స్లాట్ దళారులకు వెంటనే బుక్ అవుతుంది. దళారులు పంపిన పత్తికి కనిష్టంగా రూ.7,500, గరిష్టంగా రూ.7,900 వరకు ధర లభిస్తోంది. ఇందులో అధికారులకు, నేతలకు వాటాలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.
పత్తి రైతు చిత్త్తు
నిబంధనల పేరుతో తక్కువ ధరకు పత్తి కొనుగోలు
అదే పత్తి విక్రయానికి రైతుల పేరుతోనే స్లాట్‌ల బుకింగ్
సీసీఐ తిరస్కరించిన పత్తినే కొనుగోలు చేస్తున్న దళారులు
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో దళారులంతా టీడీపీ మద్దతుదారులు
ప్రైవేటు వ్యాపారులతో కుమ్మకై ్క ...
పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ స్థానిక ప్రైవేటు వ్యాపారులతో కుమ్మకై ్క తేమ నిబంధనల పేరుతో రైతులను దగా చేస్తున్నారు. రైతులు వద్ద తేమ శాతం 14 వస్తే పత్తి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల పత్తి విషయంలో తేమ శాతం చూడకుండానే కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఉన్న తేమ నిబంధనాలు, వ్యాపారులకు వర్తించవా. సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తుంటే, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
– పెండ్యాల మహేష్ , సత్తెనపల్లి మండల కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం
1/1
సీసీఐ రాజ్యం..దళారుల భోజ్యం