మిరప రైతుకు కలిసి రావడం లేదు..
ప్రభుత్వం నుంచి స్పందనేది?
● మోంథా తుఫాన్ ప్రభావంతో
తీవ్రంగా నష్టపోయిన పల్నాడు రైతులు
● పొలాల్లో దెబ్బతిన్న పంటను
చూస్తూ అన్నదాతల ఆవేదన
● ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు
ఎవరూ కన్నెత్తి చూడటం లేదని
ఆగ్రహం
● రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు
చేసి నష్టపోయామని కన్నీరు
పెడుతున్న కౌలు రైతులు
● దెబ్బతిన్న పంటలను కాపాడుకునేం
దుకు అష్టకష్టాలు పడుతున్న కర్షకులు
● జిల్లాలోని తుఫాన్ ప్రభావిత
ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పర్యటన
మిర్చి పంటను కాపాడుకునేందుకు మందులు కలుపుతున్న రైతు
సాక్షి, నరసరావుపేట : మోంథో తుఫాన్ పల్నాడు జిల్లాను అతలాకుతలం చేసింది. కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటుతుందని, అక్కడ తీవ్ర నష్టమని ప్రభుత్వం ప్రకటనలు చేసింది. తీరా ప్రకృతి ప్రకోపం పల్నాడు జిల్లా రైతులపై పడింది. ఇప్పటికే ఈ సీజన్‌లో వచ్చిన మూడు భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అది చాలదన్నట్టు మోంథో ప్రతాపం కూడా జిల్లా రైతులపై పడటంతో కోలుకోలేని విధంగా రైతులు నష్టపోయారు. ‘సాక్షి’ బృందం ఎక్కువగా ప్రభావం చూపిన చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాలలోని నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు, నరసరావుపేట రూరల్ మండలాల్లో పర్యటించింది. దెబ్బతిన్న పంటలను చూస్తూ రైతులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. పూర్తిగా దెబ్బతినగా కొన ఊపిరితో ఉన్న మిర్చి, పత్తి పంటలను బతికించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పెట్టుబడి పెట్టిన రూ.లక్షలు కాగా మరోసారి అప్పులు చేసి మందులు పిచికారి చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూలీలను పెట్టి నేలబడిన మిర్చి మొక్కలను నిలబెడుతున్నారు. పొలాల్లో ఉన్న రైతులు తమ నష్టాన్ని నమోదు చేయడానికి ఏ అధికారైనా వస్తాడా అని ఆశగా ఎదరుచూస్తున్నారు. తాము ఇంత కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం, అధికార పార్టీ నేతలెవరూ మా గోడు వినేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉన్న ఉచిత పంటల బీమా ఉంటే నష్టపరిహారం వచ్చేదని, కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి అన్యాయం చేసిందని రైతులు వాపోయారు. ముఖ్యంగా కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం. పంట సాగుకు ముందే కౌలు డబ్బులను యజమానులకు ఇచ్చేశారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో పంట దెబ్బతింది. పోనీ ప్రభుత్వం ఇచ్చే అరకొర నష్టపరిహారం అయినా అందుకుందామంటే తమకు కౌలు కార్డు లేకపోవడంతో నష్టపరిహారం భూయజమానులకు వెళ్తుతుందని వాపోతున్నారు. పల్నాడు జిల్లాలో 29,677 మంది రైతులకు చెందిన సుమారు 61,368 ఎకరాల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన వ్యవసాయ పంటలను నష్టపోయినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఇందులో అత్యధికంగా 54,145 ఎకరాల్లో పత్తి, 5,253 ఎకరాల్లో వరి పంట నష్టం కలిగింది. మరోవైపు జిల్లాలో 2,083 మంది రైతులకు చెందిన ఎకరాల్లో 3,282 ఎకరాల్లో ఉద్యాన పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. ఇందులో 3,033 ఎకరాల్లో మిర్చి పంట ఉంది. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. సమగ్ర నష్ట వివరాల సేకరణ పూర్తయితే నష్టపోయిన పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముంది.
నేను ఏడెకరాల్లో పత్తి సాగు చేశాను. ఇంత వరకూ ఒక్క ఒలుపు కూడా పత్తి తీయలేదు. తుఫాన్ కారణంగా పంట దెబ్బతింది. ఏడెకరాలకుగాను సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లింది. తడిచిన పత్తిని కూడా ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు చేయిస్తేనే రైతులకు నష్టం కొంత మేర తగ్గుతుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా ప్రకటనేది రాలేదు. వీలైనంత త్వరలో రైతులకు పంట నష్టపరిహారం అందించాలి.
–వేములపల్లి రామచంద్రరావు,
పత్తి రైతు, నాదెండ్ల మండలం
ఈ ఏడాది ఎకరం విస్తీర్ణంలో అరటి పంట సాగుచేశాను. తొమ్మిది నెలల వయస్సున్న పంట ఇప్పుడే కాపు వస్తోంది. తుఫాన్ గాలుల తీవ్రతకు అరటి పంట 75 శాతం పైగా నేలకొరిగింది. దాదాపు రూ.60 వేలు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టాను. తుఫాన్ కారణంగా పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
–ముప్పాళ్ల కోటేశ్వరరావు, అరటి రైతు, మిన్నెకల్లు
ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాం. ప్రస్తుతం రెండు నెలల పంట కాలంలో పూత, పిందె, కాయ దశలో ఉంది. మూడెకరాలు పూర్తిగా నీటమునిగి పంట వేళ్లు కుళ్లి పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. పీకేసి మరో పైరు వేసుకోవాల్సిందే. మిగిలిన రెండెకరాల్లో సుమారు 40 శాతం మేర పంట నష్టం జరిగింది. సుమారు రూ.4 లక్ష దాకా నష్టపోయాం. తుఫాన్ ప్రభావం గోదావరి జిల్లాల్లో ఉందన్నారు. తీరా చూస్తే మాపై ప్రతాపం చూపింది. పంటల బీమా లేకపోవడంతో నష్టపరిహారం వస్తుందా రాదా, వస్తే ఎంత వస్తుంది అనేది తెలియడం లేదు.
– పూనాటి అంజనిదేవి, మహిళా రైతు, అమీన్‌సాహెబ్‌పాలెం,
చిలకలూరిపేట నియోజకవర్గం
సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు నుంచి రెండేళ్ల కిందట వలస వచ్చి పొలం కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేస్తున్నా. గతేడాది పంట పండినా ధర లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట చేతికి వచ్చేలా కనిపించడం లేదు. కౌలు రూ.25వేలుతో కలిపి ఇప్పటికే ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. తుఫాన్ కారణంగా నీరు నిలిచి పంట పూర్తిగా ఉరకెత్తింది.
–కట్టవరపు వీరయ్య,
కొండకావూరు
నిండా మునిగాం..
నిండా మునిగాం..
నిండా మునిగాం..
నిండా మునిగాం..


