ఎట్టకేలకు బీఈడీ ఫలితాలకు మోక్షం
పెదకాకాని: ఎట్టకేలకు మూడున్నర నెలల తర్వాత బీఈడీ ఫలితాలను వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మూడో సెమిస్టర్ ఫలితాల ను, రెండో సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. శనివారం సాక్షి దినపత్రికలో ‘విడుదల కాని బీఈడీ ఫలితాలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. మూడు నెలల తర్వాత బీఈడీ ఫలితాలు విడుదలయ్యాయి. జూలై నెలలో దరఖాస్తు చేసు కున్న మూడో సెమిస్టర్ పునఃమూల్యాంకన ఫలితాలను విడుదల చేశారు. సెకండ్ సెమిస్టర్ ఫలితాలను కూడా శనివారం ప్రకటించారు. అక్టోబరు 30న బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు ముగిసింది. దీంతో విద్యార్థులు అధికంగా ఫీజులు చెల్లించారు. అధికంగా ఫీజులు చెల్లించడంపై యూనివర్సిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తేదీని పొడిగిస్తూ నిర్ణయం కూడా జరగలేదు. ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించి ఆర్థికంగా నష్టపోయారు.


