 
															దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు
నెహ్రూనగర్: దేశవ్యాప్తంగా క్రైస్తవులపై, చర్చిలపై దాడులు పెరిగిపోతున్నాయని.. క్రైస్తవుల రక్షణకై వెంటనే ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు డిమాండ్ చేశారు. క్రైస్తవులు, చర్చిల రక్షణకు, పాస్టర్ల, సువార్తికులు, దైవసేవకుల రక్షణకు క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో ఐక్య క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చోని క్రైస్తవ అత్యాచర చట్టం రూపొందించేందుకు ప్రభుత్వాలకు తగిన కనువిప్పు కలగాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాజసుందరబాబు మాట్లాడుతూ చర్చిలలో పాస్టర్లు శాంతి సమాధానాలు గురించే బోధించడం జరుగుతుందని, ఎటువంటి హింసాత్మక బోధనలు చేయరని అటువంటి వారిపై నిరంతరం దాడులు జరగడం శోచనీయమన్నారు. క్రైస్తవ మిషనరీలు విద్య, వైద్యాన్ని దేశానికి అందించారన్నారు. వారు చేసిన సేవల వల్ల భారతదేశంలో పలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు సంభవించాయన్నారు. అనంతరం 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ ఆశుతోష్ శ్రీవాస్తవకు అందజేశారు.
 
							దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
