 
															అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే విడుదల చేయాలి
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
పిడుగురాళ్లరూరల్: అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే రైతులకు అందేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుత్తికొండలో మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఓడిపోయిన కాసు మహేష్‌రెడ్డి పొలాల్లో తిరుగుతున్నాడని, గెలిచిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎక్కడ ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఓడిపోయినా కూడా ప్రతి పక్షంలో ఉండి ప్రజలకు న్యాయం చేద్దామని గ్రామాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు సీఎం చంద్రబాబు సన్నిహితులని విన్నామని.. వారు ఆయనతో మాట్లాడి అన్నదాత సుఖీభవ గత ఏడాది రూ.20 వేలు మంజూరు చేయించాలని కోరారు. ఈ ఏడాది రూ.20 వేలకు రూ.5 వేలు మాత్రమే జమ అయ్యాయని, వెంటనే రూ.35 వేలు రైతులకు అందేలా చూడాలని కోరారు. సీఎం చంద్రబాబు గెలిచినప్పటి నుంచి అమరావతి అంటూ జపం చేస్తున్నాడని, ఆయన అమరావతి దాటి వచ్చి క్షేత్రస్థాయిలో తిరిగి రైతుల సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంలో పార్టీ విభేదాలు చూపిస్తే సచివాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
