 
															ప్రభుత్వానికి ఎస్టీలంటే చిన్నచూపు
మంగళగిరి టౌన్: రాష్ట్ర ప్రభుత్వానికీ, అధికారులకు ఎస్టీలంటే చిన్నచూపు అని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగరపరిధిలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద అసోసియేషన్ ప్రతినిధులు గురువారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్, సబ్సిడీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ గత 5 సంవత్సరాల నుంచి సబ్సిడీ తగిన సమయంలో విడుదల కాకపోవడంతో షెడ్యూల్ ట్రైబ్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏపీ ఎంఎస్‌ఎంఈ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 6 శాతం ఇన్సెంటివ్, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.100 కోట్ల బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కు 6 శాతం ఇన్సెంటివ్‌ను, వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత వారంలో కమిషనర్ మంగళవారం వరకు సమయం ఇచ్చారని, ఇంతవరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఎస్టీ పారిశ్రామికవేత్తలను బలపరిస్తేనే ఆంధ్రప్రదేశ్ బలపడుతుందని అన్నారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శామ్యూల్, వైస్ ప్రెసిడెంట్ పరమేష్, అసోసియేషన్ ప్రతినిధులు శంకర్‌నాయక్, రామమూర్తి నాయక్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
