 
															జిల్లాలో 313.8 మిల్లీమీటర్ల వర్షం
నరసరావుపేట: జిల్లాలో బుధవారం ఉదయం 8.30 నుంచి 24గంటల వ్యవధిలో 313.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు గురువారం పేర్కొన్నారు. మండలానికి సరాసరి 11.2 మి.మీ. కురిసిందని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా మాచర్ల నియోజకవర్గంలో 34.4 మి.మీ. పడింది. వెల్దుర్తిలో 33.8, దుర్గిలో 13.8, రెంటచింతల 9.4, గురజాల 13.4, దాచేపల్లి 6.6, కారెంపూడి 2.4, పిడుగురాళ్ల 9.0, మాచవరం 9.4, బెల్లంకొండ 6.2, అచ్చంపేట 11.2, క్రోసూరు 8.2, అమరావతి 9.8, పెదకూరపాడు 4.8, సత్తెనపల్లి 6.8, రాజుపాలెం 3.8, నకరికల్లు 2.2, బొల్లాపల్లి 25.8, వినుకొండ 2.8, నూజెండ్ల 2.4, శావల్యాపురం 13.8, ఈపూరు 3.0, రొంపిచర్ల 5.2, నరసరావుపేట 17.2, ముప్పాళ్ల 16.4, నాదెండ్ల 12.2, చిలకలూరిపేట 17.4, యడ్లపాడు 12.4 మి.మీ. వర్షం కురిసింది.
పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకం
నగరంపాలెం: పోలీసుల సేవలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకుని సమాజసేవలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని పోలీస్ కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్‌ను జిల్లా ఎస్పీ సందర్శించి, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వినియోగించే ఆయుధాల పనితీరును విద్యార్థులకు వివరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజానికి పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను విద్యార్థులకు వివరించడమే ఓపెన్ హౌస్ ఉద్దేశమని అన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లు, ఉపయోగించే ఆయుధాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఓపెన్ హౌస్ ఉపయోగపడుతుందన్నారు. ప్రతిరోజు విధి నిర్వహణలో వాడే పరికరాలు, ఆయుధాలు, సీసీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, జాగిలాలు, లాఠీలు, బందోబస్తు తనిఖీల పరికరాలు, ఆధారాల సేకరణ పరికరాలపై అవగాహన కల్పించారు. జాగిలాల పనితీరుని విద్యార్థులకు పరిచయం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు ఏడుకొండలరెడ్డి (ఏఆర్), అబ్ధుల్‌అజీజ్ (గుంటూరు తూర్పు) సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్‌బీ), వీరయ్య చౌదరి (కొత్తపేట పీఎస్), వెంకటప్రసాద్ (పాతగుంటూరు పీఎస్), ఆర్‌ఐలు శివరామకృష్ణ, సురేష్, శ్రీహరిరెడ్డి, శ్రీనివాసరావు, పోలీస్ అధికార సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
