 
															మోంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తెనాలి: మోంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరికి ఎకరాకు రూ.25 వేలు, అరటి, పసుపు, కంద, క్యాలీఫ్లవర్ వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని కొల్లిపర, తెనాలి మండలాల్లోని దావులూరు, జముడుపాడు, బుర్రిపాలెం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న వరి పొలాలను గురువారం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి, రైతు సంఘం కొల్లిపర మండల నాయకులు వై.బ్రహ్మేశ్వరరావు, ముక్కంటి తదితరులతో కలిసి పరిశీలించారు. పంట నష్టానికి సంబందించిన వివరాలను రైతుల నడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలు నమోదు చేస్తారని, అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడా పర్యటించడం లేదనీ, దెబ్బతిన్న పంటల వివరాలు నమోదుచేయడం లేదన్నారు. ఇప్పటికై నా పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించి నమోదు చేసి, నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ పంటల బీమా విధానం మేలు
గత ప్రభుత్వం అనుసరించిన పంటల బీమా విధానం రైతులకు ఎంతో మేలు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భాగస్వామ్యం పేరుతో ఉచిత పంటల బీమాకు రైతులను దూరం చేశారని ప్రభాకరరెడ్డి విమర్శించారు. కరువు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంటల బీమా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతినటమే కాదు, తుఫాన్‌కు ముందు కురిసిన అధిక వర్షాల వల్ల కూడా నిమ్మ తోటలు భారీగా దెబ్బతిన్నాయని నిమ్మ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంఘం కొల్లిపర, దుగ్గిరాల మండల నాయకులు ముక్కంటి, బ్రహ్మేశ్వరరావు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
