త్రుటిలో తప్పిన ప్రమాదం
వంతెనపై పరదాల లోడు లారీ పల్టీ లారీ క్యాబిన్, వంతెన రెయిలింగ్ ధ్వంసం
చిలకలూరిపేటటౌన్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా లారీ పల్టీ కొట్టింది. వంతెనపై నుంచి వాగులో పడకుండా వంతెన సైడ్ రెయిలింగ్ ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. గోనెసంచుల పరదాల లోడు లారీ నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 6 గంటల సమయంలో కావూరు సమీపంలోని కుప్పగంజి వాగు వంతెన సమీపానికి రాగానే ఒక్కసారిగా లారీ కుడిపక్కకు వాలింది. అప్రమత్తమైన డ్రైవర్ క్లీనర్‌లు కిందకు దూకేశారు. పక్కకు వాలిన లారీ ఏకంగా వంతెన సైడ్ రైలింగ్‌పై పడి క్యాబిన్ సగానికి ధ్వంసమైంది. వంతెన రైలింగ్‌కూడా దెబ్బతింది. రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ నిలిచి పోయింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌ను తెప్పించి యుద్ధ ప్రాతిపదికన లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


