సీఎంను కలిసేందుకు కేఎల్ రావు కాలనీ వాసుల యత్నం
●అడ్డుకున్న పోలీసులు
●ఆందోళనలో కాలనీవాసులు
తాడేపల్లి రూరల్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కేఎల్ రావు కాలనీలో నివాసముండే వారి ఇళ్లను తొలగిస్తున్నారని ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు కాలనీవాసులు సోమవారం ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళుతున్న క్రమంలో బకింగ్‌హామ్ కెనాల్ హెడ్ స్లూయిస్ వద్ద తాడేపల్లి పోలీసులు అడ్డుకుని వారిని సీఎం నివాసానికి వెళ్లేందుకు నిరాకరించారు. అక్కడ కొంతసేపు మహిళలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో రాజధాని నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మించేందుకు ఉండవల్లి అమరావతి కరకట్ట నుంచి కేఎల్ రావు కాలనీ మీదుగా బకింగ్ హామ్ కెనాల్‌ను దాటిస్తూ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు సీఆర్‌డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులు మీ ఇళ్లు తొలగిస్తాం అంటూ చెప్పడంతో ఆందోళన చెందిన స్ధానిక ప్రజలు నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సీఎంను, మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్‌ను కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని భావించి వారి నివాసానికి వెళితే న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నారు. కేఎల్ రావు కాలనీలో సుమారు 1000 కుటుంబాలు ఉన్నా యి. వీరందరూ ప్రతిరోజు విజయవాడలోని మార్కెట్‌లో హమాలీ పని చేసుకుంటుండగా, మహిళలు పంట పొలాల్లో కూలి పనులకు వెళ్తారు. ఉన్నట్టుండి ఇళ్లు తొలగిస్తే మేము ఎక్కడికి వెళ్లాలి? కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని స్థానిక కూటమి నాయకులకు తెలిపామని, వారు ఇదిగో అదిగో మాట్లాడతామని చెబుతున్నారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారా లోకేష్‌ను కలసి తమ గోడు వినిపించుకుందామని అనుకుంటున్నామని, ఆ అవకాశం మాకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మహిళలు వాపోయారు.


