అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: వాయుగుండం ప్రభావం నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ప్రధాన కేంద్రంలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ సిబ్బంది వారి సచివాలయం పరిధిలోనే ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని, అత్యవసర ఫోన్ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, పూరి గుడిసెలలో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్ సరఫరా అంతరాయలను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కలెక్టరెట్, ఆర్డీఓ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాలతోపాటు అన్నీ మండల కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


