పేదలకు విద్య, వైద్యం దూరం చేసే కుట్ర
మాచర్ల రూరల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ప్రజారోగ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వైద్యశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన బినామీలకు వైద్య కళాశాలలను కట్టబెట్టేందుకు చంద్రబాబు పీపీపీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి పేద ప్రజలకు వైద్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మెడికల్ సీట్లు రాకుండా అడ్డుకుంటూ చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నాడన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కొత్త కాలేజీలు ఆపాలన్న కుటిల నీతితో నిర్మాణ పనులు నిలుపుదలచేశారని, అంతేకాకుండా ఆరోగ్యశ్రీని పూర్తిగా దెబ్బతీసి కోట్ల రూపాయల నిధులను వైద్యశాలలకు చెల్లించకుండా రోగులను ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
ర్యాలీ నవంబర్ 4కి వాయిదా
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో తలపెట్టిన ర్యాలీనీ తుపాను కారణంగా వాయిదా వేసినట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 4వ తేదీన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ విషయాన్ని కార్యకర్తలకు, నాయకులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడు కొమ్మారెడ్డి చలమారెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు, ఎస్సీ విభాగం నాయకులు కందుకూరి మధు, మాచర్ల సుందరరావు, జెడ్పిటీసీ మాజీ సభ్యులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు షేక్ అబ్దుల్ జలీల్, బోయ రఘురామిరెడ్డి, పార్టీ నాయకులు పోతురెడ్డి కోటిరెడ్డి, బూడిద శ్రీనివాసరావు, డి శ్రీనివాసరెడ్డి, షేక్ మస్తాన్, చల్లా కాశయ్య, సత్తార్, నవులూరి చెన్నారెడ్డి, పిల్లి కొండలు, అన్నెం అనంతరావమ్మ, మందా సంతోష్, గురవయ్య, పిన్నెల్లి హనిమిరెడ్డి, కొండా శివలింగరాజు, మండ్లి మల్లుస్వామి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి


