ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28న ర్యాలీలు
నరసరావుపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 28న జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ర్యాలీల్లో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టనున్న ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ పోస్టర్‌ను గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలసి గోపిరెడ్డి ఆవిష్కరించారు. గోపిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలకు అనుమతి తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు పూనుకున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుందని తెలిపారు. ర్యాలీలకు అనుమతి లేదు ..కేసులు పెడతామని ఎవరైనా అన్నా భయపడేది లేదని, అనుమతి ఉన్నా, లేకపోయినా ర్యాలీ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చి శివకోటి, నిడమానూరి సురేంద్ర, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పడాల శివారెడ్డి, గెల్లి చిన్న కోటిరెడ్డి, కనకా పుల్లారెడ్డి, ఎన్‌కే ఆంజనేయులు, ఉప్పుతోళ్ల వేణుమాధవ్, ఎస్.సుజాతాపాల్, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, గెల్లి బ్రహ్మారెడ్డి, నేలటూరి సురేష్, షేక్ రెహమాన్, మర్రిపూడి రాంబాబు, కోటపాటి మనింద్రారెడ్డి, మూరె రవీంద్రారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


