అమ్మవారి ప్రధాన ఆలయానికి ఉత్సవ శోభ మూలవిరాట్, ఉత్సవ మూర్తికి గాజుల అలంకరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం గాజుల తో విశేషంగా అలంకరించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ప్రధాన మూలవిరాట్‌తోపాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి, ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారికి సప్త వర్ణాలతో మెరిసిపోతున్న గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయానికి గాజులతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యమ ద్వితీ య, భగిని హస్త భోజనాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తిక మాసంలో అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరిస్తారు. తెల్లవారుజాము న అమ్మవారికి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతు లు, ఆలయ అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఉత్సవానికి సుమా రు 4.31 లక్షల గాజులను సేకరించినట్లు అధికా రులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజా సామగ్రితోపాటు గాజులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ముత్తయిదువులు గాజులు, పసుపు, కుంకుమను ఇచ్చిపుచ్చు కున్నారు. ఉత్సవం నేపథ్యంలో 300 మంది సేవా సిబ్బంది 24 గంటలపాటు నిర్విరామంగా సేవలందించి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. అమ్మవారికి అలంకరించి న గాజులను ఉత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సర్వాంగ సుందరంగా అలంకరణ
గాజుల ఉత్సవం నేపథ్యంలో అమ్మవారి మూలవిరాట్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెద్ద, మీడియం, చిన్న సైజు గాజులతో అమ్మవారికి అవసరమైన ఆభరణాలను తీర్చిదిద్ది అలంకరించారు. గాజుల అలంకారంలో అమ్మవారి రూపం ముగ్దమనోహరంగా ఉందని భక్తులు అంటున్నారు.
సాయంత్రం పెరిగిన రద్దీ
ఉదయం 9 గంటల వరకు వాతావరణం సాధారణంగా ఉండటంతో భక్తుల రద్దీ కనిపించింది. 9 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రద్దీ తగ్గింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో రద్దీ పెరిగింది.


