జనజీవనం అస్తవ్యస్తం
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
స్తంభించిన రోజువారీ కార్యకలాపాలు
వీధులన్నీ నిర్మానుష్యం
ఇబ్బందులు పడ్డ చిరు వ్యాపారులు
అత్యధికంగా మాచవరంలో 25.2 మి.మీ
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం(08647–252999) ఏర్పాటు
నరసరావుపేట: వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. తోపుడు బండ్ల వ్యాపారులు, చిన్న తరహా వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డారు. కక్షిదారులు లేక రిజిస్ట్రార్ కార్యాలయం మూగబోయింది. 28 మండలాల్లో 330.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు. అత్యధికంగా మాచవరం మండలంలో 25.2 మి.మీ వర్షం కురవగా అత్యల్పంగా అచ్చంపేట మండలంలో 2.2వర్షం కురిసింది. మిగతా మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే...మాచర్లలో 11.4, వెల్దుర్తి 2.4, దుర్గి 6.6, రెంటచింతల 10.4, గురజాల 5.8, దాచేపల్లి 10.2, కారంపూడి 14.2, పిడుగురాళ్ల 13.4, బెల్లంకొండ 13.4, క్రోసూరు 11.0, అమరావతి 6.4, పెదకూరపాడు 9.0, సత్తెనపల్లి 13.8, రాజుపాలెం 9.8, నకరికల్లు 15.2, బొల్లాపల్లి 7.6, వినుకొండ 19.6, నూజెండ్ల 18.6, శావల్యాపురం 9.4, ఈపూరు 15.8, రొంపిచర్ల 12.4, నరసరావుపేట 8.6, ముప్పాళ్ల 7.8, నాదెండ్ల 9.4, చిలకలూరిపేట 24.2, యడ్లపాడు 17.0 మి.మి వర్షం కురిసింది.
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రానున్న మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. శిథిలావస్థ గృహాల్లో నివాసం ఉంటున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నం.08647–252999 ఏర్పాటుచేశామని తెలిపారు.
పొంగి ప్రవహిస్తున్న వాగులు
రొంపిచర్ల:మండలంలో విస్తృతంగా వర్షాలు కురు స్తున్నాయి. రొంపిచర్లలో గురువారం ఉదయానికి 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ కార్యాలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం 2 గంటల వరకు ఎడతెరపిలేకుండా కురిసింది. ఈ వర్షాలకు మండలంలోని ఓగేరు వాగు, గాడిదల వాగు, ఏడుగడియల వాగు, కారంపూడి వాగు, ఊర వాగు, ఎద్దు వాగు తదితర వాగులన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మాచవరం సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించటంతో రెండు గంటల పాటు రాకపోకలు నిలిచాయి.
మాచవరం, మర్రిచెట్టుపాలెం గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఓగేరు వాగు
జనజీవనం అస్తవ్యస్తం


