యువతకు స్పాట్
మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు వాటి జోలికెళ్లొద్దంటూ పోలీసులకు ఓ మంత్రి ఆదేశం విచ్చలవిడిగా పట్టణంలో వ్యభిచార కేంద్రాలు ఓ లాడ్జిలో ఏడు జంటలను పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం
మనోళ్లే వదిలేయండి..
నరసరావుపేట టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటింది. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు. సింగపూర్ మాటేమోగానీ జిల్లా కేంద్రాన్ని మసాజ్ సెంటర్లకు అడ్డాగా మారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరసరావుపేట.. మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు వేదికై ంది. ఈ ధోరణి ఇలానే కొనసాగితే అసాంఘిక కార్యకలాపాలకు నరసరావుపేట హబ్‌గా మారే ప్రమాదముందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఒకే లాడ్జిలో ఏడు జంటలు
నరసరావుపేట నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న లాడ్జిలను బుధవారం పోలీసులు తనిఖీ చేసి ఏడు జంటలను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నుంచి ఈ లాడ్జిలో ప్రతిరోజూ ఇదే తరహా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని లాడ్జిల్లోనూ ఇదే తరహా వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. మరోవైపు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన జూదరులు నరసరావుపేటలోని హోటళ్లను కేంద్రాలుగా చేసుకొని పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్టు ఆరోపణలు లేకపోలేదు.
‘స్పా’ ముసుగులో...
నరసరావుపేట అభివృద్ధి చెందడం ఏమోగానీ థాయ్‌లాండ్ తరహా మసాజ్ సెంటర్లు వెలిశాయి. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రావిపాడు రోడ్డులతోపాటు ఎల్‌టీ నగర్, సాయినగర్‌లలో ‘స్పా’ సెంటర్లు ఏర్పాటు చేశారు. ‘స్పా’ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు అక్కడికి వెళ్లి వచ్చినవారు చెప్పుకొస్తున్నారు. రిలాక్స్ కోసమంటూ వచ్చిన వారికి వలపు వల వేసి జేబులు గుల్ల చేస్తున్నారు. ఒక్కో స్పా సెంటర్‌లో గంటల లెక్కన వేల రూపాయలు ధరలు నిర్ణయించారు. వీటితోపాటు వ్యభిచారం కూపంలోకి లాగి యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో ప్రత్యేకమైన గదులు, ఆన్‌లైన్ బుకింక్ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.
‘స్పా’ సెంటర్ల ముసుగులో కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి అనుమతులు, నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించేందుకు పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చినా అధికారం అడ్డుపడుతోంది. పక్క నియోజకవర్గంలో ‘స్పా’ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి నరసరావుపేట పట్టణంలో కూడా నూతన బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఆ మసాజ్ సెంటర్‌పై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. మనోళ్లవే వదిలేయండి.. అంటూ ఓ మంత్రి స్వయంగా సీఐ స్థాయి అధికారిని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.


