టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ
దాడి చేసిన వారే మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు
నరసరావుపేట: టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరుగుతుంది. అందులో భాగంగానే పిడుగురాళ్ల పట్టణంలో జనసేన పార్టీకి చెందిన కరెడ్ల చిన్న సాంబశివరావుపై గురువారం రాత్రి టీడీపీ నాయకుడు ఎం. కొండలు తన అనుచరులతో దాడి చేశారు. అడ్డొచ్చేందుకు ప్రయత్నించిన చిన్న సాంబశివరావు అన్నలు పెద్ద సాంబశివరావు, కోటయ్యలపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. పిడుగురాళ్ల పట్టణంలోని హైస్కూల్ కాంప్లెక్స్‌లో జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఏడో నెంబర్ షాపులో 20 సంవత్సరాలుగా ఆటోమొబైల్స్ వ్యాపారం చేస్తూ జనసేన పార్టీకి చెందిన కారెడ్ల చిన్న సాంబశివరావు జీవనం సాగిస్తున్నాడు. ఈ షాపును స్థానిక టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తమకు ఇచ్చారని, మీరు వ్యాపారం చేస్తున్నందుకు నెలకు రూ.30 వేలు మాకు చెల్లించాలని కొన్నాళ్లుగా సాంబశివరావును టీడీపీ నాయకుడు వేధిస్తున్నాడు. జిల్లా పరిషత్ వారికి నెలకు రూ.3వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నామని మీకు చెల్లించాల్సిన అవసరం లేదని, మేము జనసేన పార్టీకి చెందిన వారమని సాంబశివరావు చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యే ఈ షాపును మాకిచ్చారు. మీరు షాపు ఖాళీ చేయాలని టీడీపీ నాయకుడు తన అనుచరులతో ఆటోమొబైల్ షాప్ పై దాడి చేసి షాప్‌లో ఉన్న వస్తువులను రోడ్డుపై పడేసి కొంత సామాన్లు ఆటోలో తరలించారు. అడ్డుకున్న చిన్న సాంబశివరావును చితకబాది రోడ్డుపై పడేశారు. ఈ దాడిలో చిన్న సాంబశివరావుకు చేయి విరిగింది. తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుపడిన సాంబశివరావు సోదరులను కూడా తీవ్రంగా కొట్టి తిరిగి వారిపైనే పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దాడి చేసిన వారే తిరిగి మాపై ఫిర్యాదు చేసి మా వాళ్లని పోలీస్‌స్టేషన్ కి తీసుకువెళ్లారని ఇదెక్కడి న్యాయం. అసలు జనసేన లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిందా, స్థానిక ఎమ్మెల్యే చెప్తేనే మేము దాడి చేశామని చెప్తున్నారు. రూ.3వేలు అద్దె చెల్లించాల్సిన షాప్‌కి నెల నెల రూ.30 వేలు చెల్లించాలని టీడీపీ నాయకులు బెదిరించడం ఎంతవరకు న్యాయం. ఇదేనా ప్రభుత్వం చేసే పని అసలు జనసేన పార్టీ వాళ్లను టీడీపీ నాయకులు చులకనగా చూస్తున్నారు.
– కారెడ్ల రమణ (చిన్న సాంబశివరావు భార్య), పిడుగురాళ్ల.
టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ


