ఏఎన్‌యూలో ఎస్‌పీఎఫ్ ఆవిర్భావ వేడుకలు
పెదకకాని: ఏపీ ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పీఎఫ్) ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం ఎస్‌పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ, ఇన్‌స్పెక్టర్ జనరల్ బీవీ రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుమార్ విశ్వజిత్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ..ఎస్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం, రిక్రూట్‌మెంట్, 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లను అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. స్పెషల్ హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్, నాగార్జున వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాంప్రసాద్, కమాండెంట్ డీఎన్‌ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్‌స్పెక్టర్‌లు, పలువురు ముఖ్య అధికారులు, స్పాన్సర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


