కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలి
కొరిటెపాడు(గుంటూరు): పత్తి కొనుగోళ్ల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్, సీసీఐ కొనుగోలు కేంద్రాలపై గుంటూరు మార్కెట్ యార్డులో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నాయకులతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ సునీత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 సీసీఐ కొనుగోలు కేంద్రాలతోపాటు మరో 11 మార్కెట్ యార్డుల్లో కూడా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. పొడవు పింజ పత్తి క్వింటాకు రూ.8,110లు, మధ్యస్త పింజ పత్తి క్వింటాకు రూ.7,710లు చెల్లిస్తామని వివరించారు. కొనుగోళ్ల ప్రారంభ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని వారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత మిల్లుకు పత్తిని తీసుకువెళ్లి విక్రయించుకోవాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ సమస్యలపై రైతులు వాట్సాప్ హెల్ప్ లైన్ నంబరు 7659954529ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ జనరల్ మేనేజర్ రాజేంద్ర షా, మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు రాజశేఖర్, కాకుమాను శ్రీనివాసరావు, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మన్నవ హరనాథబాబు తదితరులు పాల్గొన్నారు.


