
వర్షానికి కోతకు గురైన కల్వర్టు
బొల్లాపల్లి: రెండు రోజులు క్రితం కురిసిన భారీ వర్షానికి మండలంలోని గరికపాడు –పమిడిపాడు గ్రామాల మధ్య రహదారిలో ఉన్న కల్వర్టు కోతకు గురైంది. దీంతో రెండువైపులా రాకపోకలు నిలిచాయి. భారీ వర్షానికి మండలంలోని నాగులేరు ఉధృతంగా ప్రవహించడంతో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన చప్టా ఆనుకుని రోడ్డు కోతకు గురైంది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వినుకొండ–కారంపూడి రహదారి పరిధిలో బొల్లాపల్లి మండలం నుంచి రేమిడిచర్ల గుమ్మంపాడు గరికపాడు పమిడిపాడు గ్రామాలను కలుపుతూ ఈ రహదారి కారంపూడి వెళ్తుంది. గత రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాహన చోదకులు వాపోతున్నారు. బొల్లాపల్లి నుంచి కారంపూడికి చిరు వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులు రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. రెండు రోజులుగా నాగులేరు ప్రవాహానికి కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. గతంలో అదేవిధంగా వర్షాలకు కల్వర్టు మరమ్మతులకు గురైందని, అప్పట్లో తూతు మంత్రంగా మరమ్మతులు చేపట్టంతో ఈ దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు కోతకు గురైన కల్వర్టును మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని వాహన చోదకులు కోరుతున్నారు.
గరికపాడు– పమిడిపాడు గ్రామాల
మధ్య నిలిచిన రాకపోకలు